‘క్వీన్‌’ ఆఫీస్‌లో కూల్చివేతలు

10 Sep, 2020 03:55 IST|Sakshi
కంగనా ఆఫీస్‌లో అక్రమ నిర్మాణాలను కూల్చేసిన దృశ్యం

మండిపడ్డ కంగనా రనౌత్‌

ఉద్ధవ్‌ ఠాక్రేపై తీవ్ర విమర్శలు

బీఎంసీ పనులపై హైకోర్టు స్టే

ముంబై: బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌కు చెందిన బాంద్రా బంగ్లాలో అక్రమ నిర్మాణాలున్నాయంటూ బీఎంసీ(ముంబై మున్సిపాలిటీ) అధికారులు బుధవారం కూల్చివేతకు దిగారు. ఈ ఘటనపై కంగన తీవ్రంగా మండిపడ్డారు. నేరుగా మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌నుద్దేశించి సంభోదిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు.‘ఉద్ధవ్‌ఠాక్రే, నువ్వేమనుకుంటున్నావు? మూవీ మాఫియాతో జతకట్టి నా ఇల్లు కూల్చడం ద్వారా కక్ష తీర్చుకున్నటు భావిస్తున్నావు! కానీ గుర్తుంచుకో, కాలచక్రం ఎవరికోసం ఆగదు, ఈ రోజు నా ఇల్లు కూల్చారు, రేపు నీ అహంకారం కుప్పకూలుతుంది!’ అని వీడియో సందేశంలో వ్యాఖ్యానించారు. 2017లో కంగన ఈ బిల్డింగ్‌ను రూ.20కోట్లకు కొనుగోలు చేశారు. 

కంగన బిల్డింగ్‌లో నిర్మాణాలను బీఎంసీ కూల్చివేయడాన్ని నిలిపివేస్తూ ముంబై హైకోర్టు స్టే ఇచ్చింది. బీఎంసీ దురుద్దేశంతో చేసినట్లుందని ఆగ్రహం వ్యక్తం చేసింది. యజమాని లేనప్పుడు కూల్చివేతలు ఎలా ఆరంభించారని, నోటీసులకు స్పందించేందుకు కేవలం 24గంటలే ఎందుకు సమయం ఇచ్చారని బీఎంసీని కోర్టు ప్రశ్నించింది. తన బిల్డింగ్‌లో చేపట్టిన కూల్చివేతలను నిలిపివేయాలన్న కంగన పిటీషన్‌ను విచారించిన కోర్టు తదుపరి వాదనలను గురువారానికి వాయిదా వేసింది.   కంగన, శివసేన వివాదం క్రమంగా బీజేపీ వర్సెస్‌ శివసేన వివాదంగా రూపుదిద్దుకుంటోంది. కంగన కార్యాలయంలో కొన్ని నిర్మాణాల కూల్చివేతపై బీజేపీ స్పందిస్తూ శివసేన కక్షపూరిత రాజకీయాలు చేస్తోందని విమర్శించింది.

ముంబైకి కంగన
హిమాచల్‌ ప్రదేశ్‌ నుంచి కంగన బుధవారం ముంబైకి వచ్చారు. ఆమెరాకను నిరసిస్తూ శివసేన కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఎయిర్‌పోర్టు నుంచి బందోబస్తు నడుమ ఆమె ఇంటికి చేరుకున్నారు. మరోవైపు ఆర్‌పీఐ(ఏ) కార్యకర్తలు, కర్ణిసేన కార్యకర్తలు కంగనకు మద్దతుగా గుమిగూడారు. ఇటీవలే కంగనకు కేంద్రం వై ప్లస్‌ సెక్యూరిటీని కేటాయించింది. కంగన బిల్డింగ్‌లో కూల్చివేతలను హిమాచల్‌ ముఖ్యమంత్రి ఖండించారు.కంగన వ్యాఖ్యలను ప్రజలు సీరియస్‌గా తీసుకోవడం లేదని ఎన్‌సీపీ లీడర్‌ శరద్‌ పవార్‌ వ్యాఖ్యానించారు.

అలా మొదలైంది!
బాలీవుడ్‌లో డ్రగ్స్‌ మాఫియా గుట్టు రట్టు చేస్తున్న కంగనకు శివసేన ప్రభుత్వం రక్షణ ఇవ్వాలని గతంలో బీజేపీ నేత రామ్‌ కదమ్‌ కోరారు. దీనిపై కంగన స్పందిస్తూ మూవీ మాఫియా కన్నా ముంబై పోలీసులంటే తనకు భయమని ట్వీట్‌ చేశారు. ముంబై పోలీసులకు బదులుగా హిమాచల్‌ ప్రదేశ్‌ లేదా కేంద్ర బలగాలు తనకు రక్షణ కల్పించాలన్నారు. దీనిపై శివసేన నేత సంజయ్‌ రౌత్‌ ఘాటుగా స్పందిస్తూ ఆమెను ముంబైకి రావద్దని, ముంబై పోలీసులను ఆమె అవమానించారని మండిపడ్డారు.

దీనికి బదులుగా ముంబై ఏమైనా పీఓకేనా? అని కంగన ప్రశ్నించారు. దీంతో ఆమెపై చర్యలు తీసుకోవాలని రౌత్‌ ముంబై ప్రభుత్వాన్ని కోరారు. పీఓకేలో పరిస్థితులు చూసివచ్చి మాట్లాడాలని కంగనకు సలహా ఇచ్చారు. దీనిపై స్పందిస్తూ తాను 9న ముంబై వస్తున్నానని, దమ్ముంటే తనను ఆపాలని కంగన సవాల్‌ విసిరారు. తనపై చేసిన వ్యాఖ్యలకు సంజయ్‌ క్షమాపణ చెప్పాలన్నారు. బుధవారం సంజయ్‌ స్పందిస్తూ తానెప్పుడూ కంగనను బెదిరించలేదని, ముంబైని పీఓకేతో పోల్చడంపైనే తాను ఆగ్రహం వ్యక్తం చేశానని తెలిపారు. కంగన బిల్డింగ్‌లో నిర్మాణాల కూల్చివేతకు తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు.   


చండీగఢ్‌లో ఎయిర్‌పోర్టులో వై–ప్లస్‌ కేటగిరీ భద్రత మధ్య కంగనా

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా