ఎంతో కీలకమైన బాడీ క్లాక్‌ గురించి ఈ విషయాలు తెలుసా?

19 Jun, 2021 20:46 IST|Sakshi

రాత్రి, పగలు తేడా లేకుండా శరీరంలో రోగ నిరోధక వ్యవస్థ నిరంతరం పహారా కాస్తుంటుందని, ఎలాంటి చొరబాటు (వ్యాధి)పైనైనా వెంటనే స్పందిస్తుందని అందరం అనుకుంటాం! కానీ ఇటీవలి పరిశోధనలు ఇమ్యూనిటీ వ్యవస్థ పనితీరు రాత్రి ఒకలాగా, పగలు ఒకలాగా ఉంటుందని అలాగే టీకా ప్రభావం కూడా తీసుకున్న సమయాన్ని బట్టి తేడాగా ఉంటుందని స్పష్టం చేస్తున్నాయి. ఇందుకు ప్రధాన కారణం జీవ గడియారం లేదా బాడీ క్లాక్‌... అసలేంటీ బాడీ క్లాక్‌? ఇమ్యూనిటీపై దీని ప్రభావమేంటి? టీకా తీసుకునే సమయాన్ని బట్టి ప్రభావం మారుతుందా? చూద్దాం...  

బాడీ క్లాక్‌ లేదా జీవ గడియారం.. మనిషిలో ఒక్క రోజులో రూపుదిద్దుకోలేదు. ప్రస్తుత బాడీ క్లాక్‌ రూపొందడానికి లక్షల సంవత్సరాలు, వేల తరాలు పట్టింది. శరీరంలోని ఇమ్యూనిటీ కణాలతో సహా ప్రతి కణం ఈ గడియారంలో భాగమే! ప్రతి కణంలో కూడా టైమ్‌ను సూచించే ప్రోటీన్లుం టాయి. ఇవన్నీ సమాహారంగా పనిచేసి మనకు రాత్రి, పగలు తేడాను తెలియజేయడమేకాకుండా, తదనుగుణంగా పనిచేస్తుంటాయి. ఉదాహరణకు మధ్యాహ్నం ఒంటిగంటకు ఠంచనుగా ఆకలవుతుంది.

కానీ అర్ధరాత్రి అదే సమయానికి నిద్రలో ఉంటాము. అంటే మన బాడీక్లాక్‌ మనం ఎప్పుడు ఏ పనిచేయాలని సమయానుగుణంగా తెలియజేస్తుంటుంది. ఈ ప్రక్రియను కొనసాగించేందుకు బాడీక్లాక్‌ 24 గంటల రిథమ్స్‌ను ఉత్పత్తి చేస్తుంటుంది. వీటిని సిర్కాడియన్‌ రిథమ్స్‌ అంటారు. ఈ రిథమ్స్‌కు అనుగుణంగా ఆయా కణాలు ఆయా పనులు చేస్తుంటాయి. ఇందుకు మరో ఉదాహరణ.. రాత్రి అయినప్పుడు మాత్రమే శరీరంలో మెలటోనిన్‌ ఉత్పత్తి అవుతుంది. ఈ రసాయనం మూలంగా మనం అలసిన ఫీలింగ్‌ కలిగి నిద్రలోకి జారుకుంటాము.

ఒక్కోసారి ఒక్కోలా..: ఇమ్యూనిటీపై బాడీ క్లాక్‌ ప్రభావం గుర్తించేందుకు చేసిన ప్రయోగాల్లో ఆశ్చర్యకరమైన అంశాలు బయటపడ్డాయి. ఒకే తరహా సూక్ష్మక్రిమి మన శరీరంలోకి ప్రవేశించి వ్యాధిని కలిగించినా, అది పగలు ప్రవేశించిందా? రాత్రి ప్రవేశించిందా? అనే అంశం ఆధారంగా వ్యాధి తీవ్రత ఉంటుందని ప్రయోగాలు వెల్లడిస్తున్నాయి. అలాగే వ్యాధులను అరికట్టేందుకు మనం తీసుకునే ఔషధాలు అవి తీసుకున్న సమయాన్ని బట్టి కూడా పనితీరులో తేడాలు చూపుతాయని తేలింది. ఉదాహరణకు నిద్రించేసమయంలో కొలెస్ట్రాల్‌ ఉత్పత్తి జరుగుతుంది కాబట్టి, రాత్రి సమయంలో కొలెస్ట్రాల్‌ తగ్గించే ఔషధం తీసుకుంటే ఎక్కువ ప్రయోజనం ఉంటుందన్నమాట!

టీకా టైమ్‌..: ఇమ్యూనిటీపై జీవగడియార ప్రభావం ఇంతలా ఉందంటే, వ్యాక్సిన్లపై కూడా దీని ప్రభావం అధికంగానే ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు. నిజానికి టీకా అనేది శరీరంలోని రోగనిరోధక వ్యవస్థపైకి జరిపే ఉత్తుత్తి దాడి. టీకా కారణంగా ఇమ్యూనిటీ కణాలు సదరు ఇన్ఫెక్షన్‌ను మెమరైజ్‌ చేసుకుంటాయి. అందువల్ల టీకా తీసుకునే సమయం కూడా దాని పనితీరుపై ప్రభావం చూపుతుందన్నది నిపుణుల మాట.     


ఇందులో నిజానిజాలు తెలుసుకునేందుకు పలువురికి ఒక్కరోజులో వివిధ సమయాల్లో ఇన్‌ఫ్లూయెంజా టీకా ఇచ్చి పరిశోధన చేశారు. వీరిలో ఉదయం 9–11 గంటల మధ్య టీకా తీసుకున్నవారిలో మధ్యాహ్నం తీసుకున్నవారి కన్నా అధిక యాంటీబాడీల ఉత్పత్తి కనిపించింది. అలాగే మరికొందరిపై బీసీజీ టీకా ఇచ్చి చూడగా, వీరిలో సైతం ఉదయం పూట టీకా తీసుకున్నవారిలో మధ్యాహ్నం బ్యాచ్‌ కన్నా ఎక్కువ నిరోధకత కనిపించింది. అలాగే హెపటైటిస్‌ టీకా తీసుకున్నవారు ఆ రోజు తగినంత నిద్రపోతే వారిలో సైతం అధిక యాంటీబాడీలు కనిపించినట్లు తెలిసింది. జీవగడియారం, నిద్ర, ఇమ్యూనిటీ మధ్య ఒక సంబంధం ఉందని,  దీంతో ఉదయం పూట టీకా తీసుకోవడం మరింత ప్రభావకారకమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఒక్కసారి గుర్తిస్తే చాలు
శరీరంలోని రోగనిరోధక వ్యవస్థలో పలురకాల ఇమ్యూనిటీ కణాలుంటాయి. ఇవన్నీ ఎల్లప్పుడూ శరీరంలోకి జరిగే చొరబాట్లను పసిగట్టేందుకు పహారా కాస్తుంటాయి. అయితే వీటిలో ఏ కణాలు, ఏ ప్రాంతంలో, ఏ సమయంలో పహారా కాయాలనేది జీవ గడియారం నిర్దేశిస్తుందని తాజా పరిశోధన వెల్లడిస్తోంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే పగటి పూట ఈ కణాలు కణజాలాల్లో ఉండిపోయి, రాత్రుళ్లు శరీరమంతా తిరుగుతుంటాయి. ఇమ్యూనిటీ కణాల సిర్కాడియన్‌ రిథమ్‌ ఏర్పడేందుకు  వేల ఏళ్లు పట్టింది. ఒకప్పుడు ఆదిమానవుడు ఇన్ఫెక్షన్లకు గురయ్యే అవకాశాలుండేవి. ఆ రోజుల్లో ఈ రిథమ్‌ రూపుదిద్దుకోవడం ఆరంభించింది. రాత్రుళ్లు ఈ కణాలు శరీరమంతా తిరిగి లింఫ్‌ గ్రంథుల్లో ఆగి ఆ రోజు మొత్తం మీద ఎదుర్కొన్న అంశాలను జ్ఞప్తీకరించుకుంటాయి. అంటే భవిష్యత్‌లో ఎప్పుడైనా అవి అప్పటికే ఎదుర్కొన్న ఇన్ఫెక్షన్‌ లక్షణాలు గుర్తిస్తే తదనుగుణంగా స్పందిస్తాయన్నమాట.  

కరోనా టీకా.. కిం కర్తవ్యం?
ప్రస్తుతం కరోనా సంక్షోభ సమయంలో ప్రపంచమంతా వ్యాక్సినేషన్‌ కార్యక్రమాలు చురుగ్గా సాగుతున్నాయి. ఈ సమయంలో కోవిడ్‌ వైరస్‌పై బాడీ క్లాక్‌ స్పందన చాలా కీలకంగా మారింది. కోవిడ్‌ 19 వైరస్‌ మానవ శరీర కణాల్లోకి ప్రవేశించేందుకు అవసరమైన కణ గ్రాహకాలు(సెల్‌ రిసెప్టార్లు) బాడీక్లాక్‌ కంట్రోల్‌లో ఉంటాయని పరిశోధనలు చెబుతున్నాయి. మానవ శ్వాసకోశ మార్గంలో ఈ రిసెప్టార్లు రోజులో కొన్ని సమయాల్లో అధిక చురుగ్గా ఉంటాయని తేలింది. అంటే అలాంటి సమయాల్లో కరోనా సోకే అవకాశాలు ఎక్కువ. కానీ ఈ విషయమై ఇంకా లోతైన పరిశోధనలు జరగాల్సిఉంది. బాడీక్లాక్‌ను అనుసరించి కోవిడ్‌ టీకా ఏ సమయంలో తీసుకుంటే ఎక్కువ ప్రభావవంతంగా ఉంటుందనే అంశంపై కూడా ఇంకా పూర్తి పరిశోధనలు జరగాల్సిఉంది. కానీ సంక్షోభ సమయంలో ఫలానా టైంలోనే టీకా తీసుకోవాంటే కుదిరేపని కాదు కాబట్టి, ఎవరి వీలును బట్టి వారు టీకా తీసుకోవడమే ప్రస్తుతం చాలా ముఖ్యం. కానీ భవిష్యత్‌లోనైనా బాడీక్లాక్‌ను అనుసరించి ‘‘సరైన’’ సమయంలో టీకా తీసుకోవడం అధిక ప్రభావశీలంగా ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు.       
– సాక్షి, నేషనల్‌ డెస్క్‌  

మరిన్ని వార్తలు