సంచలన తీర్పు.. ఆధారాల్లేకుండా భర్తను స్త్రీలోలుడు, తాగుబోతు అనడం క్రూరమే

25 Oct, 2022 18:51 IST|Sakshi

సాక్షి, ముంబై: బాంబే హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఎలాంటి ఆధారాలు లేకుండా భర్తను స్త్రీలోలుడు(తిరుగుబోతు), తాగుబోతు అంటూ భార్య ఆరోపించడం క్రూరత్వమే అవుందని కోర్టు వెల్లడించింది. దంపతులకు విడాకులు మంజూరు చేస్తూ గతంలో ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ తాజాగా బాంబే హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.

కాగా స్థానికంగా ఉండే రిటైర్డ్‌ ఆర్మీ అధికారి దంపతుల వివాహాన్ని రద్దు చేస్తూ 2005 నవంబర్‌లో పుణె ఫ్యామిలీ కోర్టు తీర్పునిస్తూ.. విడాకులు మంజూరు చేసింది. అయితే ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ భార్య బాంబే హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. మహిళ హైకోర్టు అప్పీల్‌ విచారణ పెండింగ్‌లో ఉన్న సమయంలోనే ఆర్మీ అధికారి మరణించడంతో అతని చట్టపరమైన వారసుడిని ప్రతివాదిగా చేర్చాలని కోర్టు ఆదేశించింది.

మహిళ తన అప్పీల్‌లో భర్తకు ఇతర మహిళలతో సంబంధాలు ఉన్నాయని, ఆల్కహాలిక్‌ అని పేర్కొంది. ఈ దురలవాట్ల కారణంగా తన వైవాహిక జీవితం సజావుగా సాగలేదని, తనకు అందాల్సిన ప్రతిఫలాలు దక్కలేదని ఆరోపించింది. దీనిపై జస్టిస్‌ నితిన్ జామ్దార్,షర్మిలా దేశ్‌ముఖ్‌లతో కూడిన డివిజన్ బెంచ్ విచారణ చేపట్టింది. ఎటువంటి ఆధారాలు లేకుండా భర్తపై అసత్య ఆరోపణలు చేయడం వల్ల సమాజంలో అతని పరువు, మర్యాదలను దెబ్బతీసినట్లవుతందని, ఇది క్రూరత్వానికి సమానమని బెంచ్ తీర్పునిచ్చింది. 

మహిళ ఆరోపణలు చేసింది గానీ.. వాటిని రుజువు చేసేందుకు ఆమె ఎలాంటి ఆధారాలను సమర్పించలేదని కోర్టు పేర్కొంది. వారి వివాహాన్ని రద్దు చేస్తూ ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన ఆదేశాలను హైకోర్టు తన ఉత్తర్వులో సమర్థించింది. అయితే భర్తపై పిటిషనర్ తప్పుడు, పరువు నష్టం కలిగించే ఆరోపణలు చేసి మానసిక వేదనకు గురి చేసిందని ఆయన తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. భార్య క్రూరత్వం, తప్పుడు ఆరోపణలు.. తన  పిల్లలు, మనవరాళ్ల నుంచి అతన్ని వేరు చేసిందని ప్రస్తావించారు. 

ఈ మేరకు కోర్టు పలు కీలక వ్యాఖ్యలు చేసింది. ‘పిటిషనర్ భర్త సమాజంలోని ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తి.. ఆర్మీ మేజర్‌గా పదవీ విరమణ చేశారు. ఇలాంటి వారికి సంబంధించి తప్పుడు, నిరాధారమైన ఆరోపణలు చేయడం మానసిక వేదనను కలిగిస్తుంది. తాగుబోతు, స్త్రీలోలుడు అని ముద్ర వేయడం ద్వారా సమాజంలో నాయన ప్రతిష్టను దెబ్బతీస్తుంది.  దీని వల్ల ఆరోపణలు చేసినవారితో కలిసి జీవించడం సాధ్యం కాదు’ అని హైకోర్టు పేర్కొంంటూ ఆమె పిటిషన్‌ను కొట్టివేసింది.

మరిన్ని వార్తలు