మాజీ మంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌కు బెయిల్ మంజూరు .. క్షణాల్లోనే షాక్‌!

12 Dec, 2022 18:13 IST|Sakshi

ముంబై: కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ దాఖలు చేసిన అవినీతి, అధికార దుర్వినియోగం కేసులో మహారాష్ట్ర మాజీ హోం మంత్రి, ఎన్సీపీ నేత అనిల్ దేశ్‌ముఖ్‌కు బాంబే హైకోర్టు సోమవారం బెయిల్ మంజూరు చేసింది. లక్ష రూపాయల పూచీకత్తుపై ఆయనకు బెయిల్‌ మంజూరు చేస్తున్నట్లు ఏకసభ్య ధర్మాసనం వెల్లడించింది. అలాగే సీబీఐ కార్యాలయంలో విచారణకు హాజరవ్వాలని పేర్కొంది. అయితే బెయిల్‌ మంజూరు చేసిన కొద్ది క్షణాలకే ఉన్నత న్యాయస్థానం స్టే విధించింది.

దీనిని సుప్రీంకోర్టులో సవాల్‌ చేసేందుకు సమయం కావాలని సీబీఐ హైకోర్టును కోరింది. దీనిపై స్పందించిన హైకోర్టు జస్టిస్‌ కార్నిక్‌.. అనిల్‌ దేశ్‌ముఖ్‌ బెయిల్‌ ఆర్డర్‌పై 10 రోజులపాటు స్టే విధిస్తున్నట్లు తెలిపారు. ఈ చర్యను దేశ్‌ముఖ్‌ తరఫున న్యాయవాదులు అనికేత్ నికమ్, ఇంద్రపాల్ సింగ్ తీవ్రంగా వ్యతిరేకించారు. బెయిల్‌ ఉత్తర్వులు ఏడు రోజుల్లో అమల్లోకి వచ్చేలా చూడాలని న్యాయస్థానానికి విజ్ఞప్తి చేశారు. అయితే తన ఆర్డర్‌ను సవాల్‌ చేసుకోవాలంటూ జస్టిస్‌ పేర్కొన్నారు.

కాగా  71 ఏళ్ల దేశ్‌ముఖ్‌కు అనిల్‌ దేశ్‌ముఖ్‌ మహారాష్ట్ర హోమంత్రిగా ఉన్న సమయంలో అధికారాన్ని అడ్డుగా పెట్టుకొని ముంబైలోని బార్లు, రెస్టారెంట్ల నుంచి 100 కోట్లు వసూలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి.  దీంతో మనీలాండరింగ్‌ కేసులో గతేడాది నవంబర్‌లో ఈడీ అరెస్ట్‌ చేసింది. అప్పటి నుంచి ఆయన జైల్లోనే ఉన్నారు. ఆ తర్వాత అవినీతి ఆరోపణల కేసులో సీబీఐ అదుపులోకి తీసుకుంది. 

అవినీతి ఆరోపణలపై సీబీఐ, మనీలాండరింగ్ కేసులో ఈడీ రెండూ దేశ్‌ముఖ్‌పై దర్యాప్తు చేస్తున్నాయి. మనీలాండరింగ్‌ కేసులో గత అక్టోబర్‌లోనే బాంబే హైకోర్టు  బెయిల్‌ మంజురు చేసింది. సీబీఐ కేసు కేసులో స్పెషల్‌ కోర్టు అతనికి బెయిల్‌ నిరాకరించింది. దీంతో బెయిల్‌ కోసం ఎన్సీపీ నేత హైకోర్టును ఆశ్రయించాడు. దేశ్‌ముఖ్‌ పిటిషన్‌ను విచారించిన హైకోర్టు బెయిల్‌ మంజూరు చేస్తున్నట్లు ప్రకటించింది. అయితే సీబీఐ అభ్యర్థనతో మళ్లీ స్టే విధించింది.
చదవండి: బస్సుల్లో ఉమ్మివేస్తే జరిమానా.. ఆ అధికారం కండక్టర్‌కే

మరిన్ని వార్తలు