వరవరరావుకి ప్రైవేటు వైద్యులతో పరీక్షలు నిర్వహించాలి

13 Nov, 2020 04:21 IST|Sakshi

బాంబే హైకోర్టు

ముంబై: బీమా కోరెగావ్‌ కేసులో తలోజా జైలులో రిమాండ్‌ ఖైదీగా ఉన్న విప్లవకవి వరవరరావుకి నానావతి ఆసుపత్రికి చెందిన ప్రైవేట్‌ వైద్యుల బృందంచే వీడియో కన్సల్టేషన్‌ ద్వారా పరీక్షలు నిర్వహించాలని, అవసరమైతే ఆయన వద్దకు వెళ్ళి నేరుగా వైద్య పరీక్షలు చేయాలని బాంబే హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. ఈ వైద్య పరీక్షల నివేదికను నవంబర్‌ 16 లోపు కోర్టుకి సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. నిందితుడి ఆరోగ్య పరిరక్షణకు నానావతి ఆసుపత్రి వైద్యుల పరీక్షలే ఉపయోగకరమని కోర్టు అభిప్రా యపడింది.

వరవరరావు బెయిలు విచారణను నవంబర్‌ 17కి వాయిదా వేసింది. వరవరరావు భార్య హేమలత, తన భర్తని మెరుగైన చికిత్స కోసం నానావతి ఆసుపత్రికి మార్చాలని, ఆయన ఆరోగ్యాన్ని పరీక్షించేందుకు స్వతంత్ర వైద్యుల ప్యానల్‌ను ఏర్పాటు చేయాలని, వరవరరావుకు ఉన్న ఆరోగ్య సమస్యలరీత్యా ఆయన్ను తక్షణమే బెయిల్‌పై విడుదల చేయాలని పిటిషన్‌లో కోరారు. వరవరరావు ఆరోగ్యం క్షీణిస్తోందని, అతను జైలులోనే చనిపోయే ప్రమాదం ఉన్నదని వరవరరావు తరఫు న్యాయవాది ఇందిర వ్యాఖ్యానించారు.

మరిన్ని వార్తలు