పర్మనెంట్‌ బెయిల్‌ ఇవ్వలేం

14 Apr, 2022 06:13 IST|Sakshi

వరవరరావు విజ్ఞప్తిపై బాంబే హైకోర్టు

ముంబై: కోరెగావ్‌–భీమా అల్లర్ల కేసులో తనకు పర్మనెంట్‌ మెడికల్‌ బెయిల్‌ ఇవ్వాలన్న హక్కుల నేత వరవరరావు (83) విజ్ఞప్తిని బాంబే హైకోర్టు తోసిపుచ్చింది. ఫిబ్రవరి నుంచి తాత్కాలిక మెడికల్‌ బెయిల్‌పై ఉన్న ఆయన దాన్ని మరో ఆర్నెల్ల పాటు పొడిగించాలని, ముంబైలో కాకుండా హైదరాబాద్‌లో ఉండేందుకు అనుమతించాలని, విచారణ పూర్తయేదాకా పర్మనెంట్‌ బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతూ మూడు పిటిషన్లు దాఖలు చేశారు.

వాటన్నింటినీ తిరస్కరిస్తున్నట్టు జస్టిస్‌ ఎస్‌బీ శుక్రే, జీఏ సనప్‌లతో కూడిన బెంచ్‌ పేర్కొంది. అయితే కాటరాక్ట్‌ ఆపరేషన్‌ చేయించుకునేందుకు వీలుగా బెయిల్‌ను మూడు నెలలు పొడిగించింది. వీవీలో పార్కిన్సన్‌ లక్షణాలు కన్పిస్తున్నాయని ఆయన తరఫు లాయర్‌ కోర్టు దృష్టికి తెచ్చారు. ఆయన్ను ఉంచిన తలోజా జైల్లో వైద్య సదుపాయాలు దారుణంగా ఉన్నాయన్న వాదనతో కోర్టు ఏకీభవించింది. రాష్ట్రంలోని అన్ని జైళ్లలో సదుపాయాలపై ఈ నెలాఖరుకల్లా సమగ్ర నివేదిక ఇవ్వాల్సిందిగా జైళ్ల శాఖ ఐజీని ఆదేశించింది.

మరిన్ని వార్తలు