మహారాష్ట్ర ముఖ్యమంత్రి షిండేకు ఎదురుదెబ్బ.. హైకోర్టు మొట్టికాయలు!

19 Dec, 2022 20:24 IST|Sakshi

ముంబై: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండేకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. నాగ్‌పూర్‌ ల్యాండ్‌ కేసులో బాంబే హైకోర్టు మొట్టికాయలు వేసింది. ఎంవీఏ ప్రభుత్వంలో పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్న సమయంలో.. కోర్టులో కేసు ఉన్నప్పటికీ 5 ఎకరాల ప్రభుత్వ భూమిని ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వాలని నాగ్‌పూర్‌ అభివృద్ధి ట్రస్టును ఎలా ఆదేశించారని ప్రశ్నించింది. ఈ మేరకు సమాధానం ఇవ్వాలని ఉత్తర్వులు జారీ చేసింది. 

ఉద్ధవ్‌ ఠాక్రే నేతృత్వంలోని మహా వికాస్‌ అగాడీ(ఎంవీఏ) ప్రభుత్వంలో పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా పని చేశారు ఏక్‌నాథ్‌ షిండే. 2021లో మురికివాడల పేదల కోసం కేటాయించిన 5 ఎకరాల ప్రభుత్వ భూమిని తక్కువ ధరకే 16 మంది బిల్డర్స్‌కు కేటాయించారు షిండే. దీనిపై ప్రభుత్వ భూమికి సంబంధించిన కేసు కోర్టులో ఉన్నప్పటికీ షిండే ఆదేశాలు జారీ చేశారని పిటిషనర్‌ హైకోర్టును ఆశ్రయించారు. రూ.83 కోట్లు విలువ చేసే భూమికి నాగ్‌పూర్‌ అభివృద్ధి ట్రస్టుకు కేవలం రూ.2 కోట్ల లోపే దక్కాయని పేర్కొన్నారు. 

ఈ కేసులో విచారణ చేస్తున్న బాంబే హైకోర్టు.. ఆ 5 ఎకరాలు భూమి విషయంలో యథాతథ స్థితిని కొనసాగించాలని అధికారులను ఆదేశించింది. ఈ కేసుపై సమాధానం ఇవ్వాలని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. కేసు తదుపరి విచారణను 2023, జనవరి 4కు వాయిదా వేసింది.

ఇదీ చదవండి: చేతిలో చంటి బిడ్డతో ఆ ఎమ్మెల్యే.. ఆమె సమాధానం వింటే అభినందించకుండా ఉండలేరు

మరిన్ని వార్తలు