‘బాష్‌’కు భారతీయత

1 Jul, 2022 05:52 IST|Sakshi

స్పార్క్‌ నెక్ట్స్‌’క్యాంపస్‌ను ప్రారంభించిన ప్రధాని

ప్రతి గ్రామానికీ హైస్పీడ్‌ ఇంటర్నెట్‌ సౌకర్యం కల్పిస్తామని వెల్లడి

సాక్షి, బెంగళూరు: భారత్‌కు బాష్‌ కంపెనీ ఎప్పుడో జర్మనీ నుంచి వచ్చినా ఇప్పుడు అది పూర్తిగా భారతీయతను సంతరించుకుందని ప్రధాని మోదీ కొనియాడారు. ఆటోమొబైల్‌ విడిభాగాలు మొదలుకొని సెక్యూరిటీ, గృహోపకరణాలు తయారు చేసే బాష్‌ కంపెనీ దేశంలో కార్యకలాపాలు ప్రారంభించి వందేళ్లయింది. ఈ సందర్భంగా గురువారం బాష్‌ బెంగళూరులో ‘స్పార్క్‌ నెక్ట్స్‌‘ పేరుతో నిర్మించిన భవనాన్ని ప్రధాని ఆవిష్కరించారు.

వర్చువల్‌ పద్ధతిలో జరిగిన ఈ ఆవిష్కరణలో ప్రధాని మాట్లాడుతూ భారతీయ శక్తి, జర్మన్‌ ఇంజినీరింగ్‌ల సమర్థ మేళవింపునకు బాష్‌ కంపెనీ మంచి ఉదాహరణ అని ప్రశంసించారు. భారత స్వాతంత్య్ర అమృతోత్సవాలు జరుగుతున్న సమయంలో బాష్‌ వందేళ్లు పూర్తి చేసుకోవడం ఈ ఉత్సవాలకు ఒక ప్రత్యేకతను కల్పిస్తోందని చెప్పారు. దేశంలోని ప్రతి గ్రామానికీ హై స్పీడ్‌ ఇంటర్నెట్‌ సౌకర్యం కల్పించేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందని వెల్లడించారు.

భారత్‌లో ఉన్న అవకాశాలను వినియోగించుకుంటూ డిజిటల్, టెక్నాలజీ రంగంలో పెట్టుబడులు పెట్టాలని ఆయన పిలుపునిచ్చారు. కృత్రిమ మేథతోపాటు అనేక అత్యాధునిక టెక్నాలజీలు కలిగిన ‘స్పార్క్‌ నెక్ట్స్‌’వంటి భవనాలు దేశంలో రేపటితరం ఉత్పత్తుల తయారీని వేగవంతం చేస్తుందని ప్రధాని ఆశాభావం వ్యక్తం చేశారు. భారత దేశానికి అవసరమైన మరిన్ని ఉత్పత్తులు, టెక్నాలజీలను బాష్‌ తయారు చేయాలని, రానున్న25 ఏళ్ల కు లక్ష్యాలు నిర్దేశించుకోవాలన్నారు. బెంగళూరు ప్రతిష్ట బాష్‌ ‘స్పార్క్‌ నెక్ట్స్‌’తో మరింత పెరిగిందని కర్ణాటక సీఎం బొమ్మై కొనియాడారు.

సుస్థిరత... మా తారకమంత్రం: ఫెలీజ్‌ అల్చెర్ట్‌  
‘స్పార్క్‌ నెక్ట్స్‌‘ నిర్మాణానికి ఐదేళ్లలో రూ.800 కోట్లు ఖర్చు చేసినట్లు బాష్‌ కంపెనీ బోర్డ్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ సభ్యురాలు ఫెలీజ్‌ ఆల్చెర్ట్‌ తెలిపారు. పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట వేశామన్నారు. 76 ఎకరాల్లో మొత్తం 10 వేల మంది పని చేయగల ‘స్పార్క్‌ నెక్ట్స్‌‘లో ఏటా 5.8 కోట్ల లీటర్ల వాననీటి సంరక్షణ జరుగుతుందని చెప్పారు.  వినియోగం తగ్గిందని వివరించారు. భారత్‌లో బాష్‌ పెట్టుబడులు మరిన్ని పెరగనున్నాయని, త్వరలో 25 కోట్ల యూరోలు ఖర్చు చేయనున్నామని తెలిపారు. బాష్‌ కంపెనీ దశాబ్దాలుగా ఆత్మ నిర్భర్‌ భారత్‌ కోసం కృషి చేస్తోందని ఉత్పత్తుల డిజైనింగ్‌ మొదలు తయారీ వరకూ అన్నీ చేపట్టడం ద్వారా మేకిన్‌ ఇండియాకూ ఊతమిస్తున్నామని బాష్‌ ఇండియా మేనేజింగ్‌ డైరెక్టర్‌ సౌమిత్ర భట్టాచార్య తెలిపారు.

మరిన్ని వార్తలు