పార్లమెంట్‌లో ఆగని రగడ

16 Mar, 2023 02:37 IST|Sakshi

రాహుల్‌ గాంధీ క్షమాపణ చెప్పాల్సిందే 

లోక్‌సభ, రాజ్యసభల్లో బీజేపీ డిమాండ్‌

అదానీపై జేపీసీకి విపక్షాల పట్టు

ఉభయ సభలు మళ్లీ వాయిదా

న్యూఢిల్లీ: భారత్‌లో ప్రజాస్వామ్యంపై దాడి జరుగుతోందంటూ కాంగ్రెస్‌ నేత రాహుల్‌ చేసిన వ్యాఖ్యలపై పార్లమెంట్‌లో దుమారం కొనసాగుతూనే ఉంది. అధికార, విపక్ష సభ్యుల నినాదాలు, కేకలతో ఉభయసభలు వరుసగా మూడో రోజు బుధవారం సైతం స్తంభించాయి. రాహుల్‌ క్షమాపణకు బీజేపీ సభ్యులు, అదానీ వ్యవహారంపై జేపీసీకి విపక్ష ఎంపీలు పట్టుబట్టారు. దాంతో లోక్‌సభ, రాజ్యసభ మళ్లీ వాయిదా పడ్డాయి.

ప్రజాస్వామ్యాన్ని అవమానించారు  
బుధవారం ఉదయం లోక్‌సభ ప్రారంభం కాగానే విపక్ష సభ్యులు వెల్‌లోకి దూసుకొచ్చారు. అదానీపై జాయింట్‌ పార్లమెంటరీ కమిటీ(జేపీసీ) డిమాండ్‌తో ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలకు దిగారు. రాహుల్‌ క్షమాపణ చెప్పాలంటూ బీజేపీ ఎంపీలు సైతం నినాదాలు ప్రారంభించారు. వెల్‌లోంచి వెళ్లి సభ జరగనివ్వాలని స్పీకర్‌ ఓం బిర్లా కోరారు. కార్యకలాపాలకు అడ్డు తగులుతున్న విపక్ష ఎంపీలను సస్పెండ్‌ చేయాలని స్పీకర్‌ను మంత్రి పీయూష్‌ గోయల్‌ కోరారు.

పార్లమెంట్‌ సభ్యుడైన ఓ వ్యక్తి విదేశాలకు వెళ్లి ఇదే పార్లమెంట్‌ను దారుణంగా కించపర్చారని రాహుల్‌ గాంధీపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇది చాలా తీవ్రమైన అంశమని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని విన్నవించారు. సభ మధ్యాహ్నం 2 గంటల దాకా వాయిదా పడింది. వేశారు. సభ పునఃప్రారంభమైన తర్వాత కూడా విపక్ష ఎంపీలు నినాదాలు కొనసాగించారు. సభ సక్రమంగా జరిగేలా చూడాల్సిన బాధ్యత సభ్యులందరిపైనా ఉందని సభాపతి స్థానంలో ఉన్న భర్తృహరి మెహతాబ్‌ చెప్పారు. సభలో ప్రభుత్వానికి సంబంధించిన పత్రాలకు తప్ప ప్లకార్డులకు అనుమతి లేదని స్పష్టం చేశారు.

గందరగోళం కొనసాగుతుండగానే రక్షణ శాఖ సహాయ మంత్రి అజయ్‌ భట్‌ ఇంటర్‌–సర్వీసెస్‌(కమాండ్, కంట్రోల్, డిసిప్లిన్‌) బిల్లు–2023ని లోక్‌సభలో ప్రవేశపెట్టారు. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషీ మాట్లాడుతూ.. రాహుల్‌ గాంధీ సభకు వచ్చి, క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. రాహుల్‌ మన దేశాన్ని అవమానించారంటూ ప్రవాస భారతీయుల నుంచి తనకు ఫోన్లు వస్తున్నాయని వెల్లడించారు. భారత్‌ సార్వభౌమత్వ దేశమని, మన దేశ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవాలంటూ ఇతర దేశాలను రాహుల్‌ కోరడం ఏమిటని ప్రహ్లాద్‌ జోషీ ఆక్షేపించారు. అనంతరం సభ గురువారానికి వాయిదా పడింది.  

రాజ్యసభలోనూ గందరగోళం  
లోక్‌సభలో కనిపించిన దృశ్యాలే రాజ్యసభలోనూ పునరావృతమయ్యాయి. లండన్‌లో చేసిన వ్యాఖ్యల పట్ల రాహుల్‌ గాంధీ క్షమాపణ చెప్పాలని అధికారపక్ష సభ్యులు డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్‌ సహా విపక్ష ఎంపీలు ఎదురుదాడికి దిగారు. అరుపులు కేకలతో గందరగోళం నెలకొనడంతో చైర్మన్‌ జగదీప్‌ ధన్‌ఖడ్‌ సభను మధ్యాహ్నానికి వాయిదా వేశారు. మళ్లీ ప్రారంభమైన తర్వాత ఇరుపక్షాల నడుమ వాగ్వాదం కొనసాగింది. ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే ప్రసంగించేందుకు ప్రయత్నించగా, బీజేపీ సభ్యులు అడ్డుకున్నారు. రాహుల్‌ క్షమాపణ చెప్పిన తర్వాతే కాంగ్రెస్‌ ఎంపీలు మాట్లాడాలంటూ నినాదాలు చేశారు. సభ్యులంతా శాంతించాలని చైర్మన్‌ జగదీప్‌ ధన్‌ఖడ్‌ పదేపదే కోరినా ఫలితం లేకుండాపోయింది. సభ ముందుకు సాగే అవకాశాలు లేకపోవడంతో మరుసటి రోజుకు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.   

రాహుల్‌ క్షమాపణ ప్రసక్తే లేదు: ఖర్గే
రాహుల్‌ వ్యాఖ్యలపై ఇరుకున పెట్టేందుకు ప్రయత్నిస్తున్న బీజేపీ నేతలపై గతంలో ప్రధాని మోదీ విదేశాల్లో చేసిన వ్యాఖ్యలను ఎత్తిచూపుతూ కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఎదురుదాడికి దిగారు. ‘‘భారత్‌లో పుట్టినందుకు గతంలో మీరంతా సిగ్గుతో తలదించుకునేవారు. అదో పాపంగా భావించారు. జీవిస్తున్నారు అని ప్రధాని హోదాలో చైనాలో మోదీ అన్నారు. రాహుల్‌ మాటల్లో తప్పేంలేదు. క్షమాపణలు చెప్పే ప్రసక్తే లేదు’’ అని స్పష్టంచేశారు. ‘ భావ ప్రకటనా స్వేచ్ఛ, వాక్‌ స్వాతంత్య్రాన్ని అణగదొక్కుతున్నారు. నిజం మాట్లాడితే జైలు పంపుతున్నారు. ఇది ప్రజాస్వామ్యాన్ని చంపడం కాదా?’’ అన్నారు.

మరిన్ని వార్తలు