నాలుగో రోజూ ప్రతిష్టంభన

17 Mar, 2023 04:38 IST|Sakshi

పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాల్లో కొనసాగిన గందరగోళం  

న్యూఢిల్లీ: లండన్‌లో రాహుల్‌ గాంధీ చేసిన వ్యాఖ్యలు, అదానీ గ్రూప్‌ వ్యవహారం పార్లమెంట్‌ను కుదిపేస్తున్నాయి. తమ డిమాండ్ల నుంచి అధికార, విపక్షాలు ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. విదేశీ గడ్డపై భారత ప్రజాస్వామ్యాన్ని అవమానించేలా మాట్లాడిన కాంగ్రెస్‌ నాయకుడు రాహుల్‌ క్షమాపణ చెప్పాలని అధికార బీజేపీ ఎంపీలు, అదానీ అంశంపై విచారణ కోసం జేపీసీ ఏర్పాటు చేయాలని విపక్ష సభ్యులు పట్టుబట్టారు. పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు వరుసగా నాలుగో రోజు గురువారం సైతం స్తంభించాయి. .  

రాహుల్‌ గాంధీ రాక  
లోక్‌సభ గురువారం ఉదయం ప్రారంభం కాగానే యథావిధిగా అధికార, ప్రతిపక్ష సభ్యులు నినాదాలతో హోరెత్తించారు. పరస్పరం వాగ్వాదానికి దిగారు. కాంగ్రెస్‌ సభ్యులు వెల్‌లోకి ప్రవేశించారు. దీంతో కేవలం రెండు నిమిషాల వ్యవధిలోనే స్పీకర్‌ బిర్లా సభను మధ్యాహ్నం 2 గంటల దాకా వాయిదా వేశారు. లోక్‌సభ మళ్లీ ప్రారంభమైన తర్వాత కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ సభలోకి ప్రవేశించారు. ‘లండన్‌’ వ్యాఖ్యల తర్వాత ఆయన సభకు రావడం ఇదే మొదటిసారి. అధికార బీజేపీ, విపక్ష ఎంపీలు నినాదాలు ఆపలేదు. దంతో స్పీకర్‌ సభను మరుటి రోజుకు వాయిదా వేశారు.  అధికార, ప్రతిపక్ష సభ్యుల నినాదాలు, అరుపులతో రాజ్యసభ స్తంభించింది.    

క్షమాపణ చెప్పాలి: మంత్రులు
భారత ప్రజాస్వామ్యంపై బ్రిటన్‌లో చేసిన అనుచిత వ్యాఖ్యల పట్ల కాంగ్రెస్‌ నాయకుడు రాహుల్‌ గాంధీ బహిరంగంగా క్షమాపణ చెప్పాలని కేంద్ర మంత్రులు పీయూష్‌ గోయల్, ప్రహ్లాద్‌ జోషీ డిమాండ్‌ చేశారు. అంతకంటే ముందు ఆయన తన వ్యాఖ్యలపై విచారం వ్యక్తం చేయాలన్నారు. గతంలో ఎంతోమంది సీనియర్‌ నాయకులు పార్లమెంట్‌లో క్షమాపణ చెప్పారని వారు గుర్తుచేశారు.   

అదానీపై చర్చను ఎగ్టొట్టడానికే: ఖర్గే
అదానీపై, పరిపాలనలో వైఫల్యాలపై పార్లమెంట్‌లో చర్చ జరగకుండా చూడాలన్నదే నరేంద్ర మోదీ ప్రభుత్వ కుతంత్రమని ఖర్గే ధ్వజమెత్తారు. అందుకే పార్లమెంట్‌ కార్యకలాపాలకు అడ్డు తగులుతోందని ఆరోపించారు. ఆయన గురువారం పార్లమెంట్‌ వద్ద మీడియాతో మాట్లాడారు. తాము బుధవారం పార్లమెంట్‌ నుంచి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ కార్యాలయం దాకా శాంతియుతంగా ప్రదర్శన చేపడితే దుర్మార్గంగా అడ్డుకున్నారని ఆక్షేపించారు. ముందు వరుసలో మహిళా కానిస్టేబుళ్లను ఉంచారని అన్నారు.    

కలిసికట్టుగా ప్రభుత్వాన్ని నిలదీద్దాం
రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే చాంబర్‌లో గురువారం విపక్ష నేతలు సమావేశమమయ్యారు. పార్లమెంట్‌ ఉభయ సభల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించుకున్నారు. కలిసికట్టుగా ఉంటూ, ప్రజా సమస్యలపై పార్లమెంట్‌లో కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాలని నిర్ణయించుకున్నారు. కాంగ్రెస్‌తోపాటు డీఎంకే, ఎన్సీపీ, సమాజ్‌వాదీ పార్టీ, ఆర్జేడీ, బీఆర్‌ఎస్, సీపీఎం, సీపీఐ, జేడీయూ, జేఎంఎం, ఎండీఎంకే, ఆమ్‌ ఆద్మీ పార్టీ, వీసీకే, ఐయూఎంఎల్‌ తదితర పార్టీల నేతలు ఈ భేటీకి హాజరయ్యారు. ఇదిలా ఉండగా, అదానీ అంశంపై చర్చించాలని, ఈ వ్యవహాంరపై విచారణకు జేపీసీ ఏర్పాటు చేయాలని కోరుతూ పలువురు ప్రతిపక్ష ఎంపీలు లోక్‌సభ, రాజ్యసభలో నోటీసులు ఇచ్చారు.   

మరిన్ని వార్తలు