పార్టీల ఎజెండాలదే పైచేయి

18 Mar, 2023 03:56 IST|Sakshi

వరుసగా ఐదో రోజూ స్తంభించిన లోక్‌సభ, రాజ్యసభ 

పట్టువీడని అధికార, విపక్ష సభ్యులు 

రాహుల్‌ గాంధీ క్షమాపణ చెప్పాలన్న బీజేపీ ఎంపీలు 

అదానీపై జేపీసీ ఏర్పాటు చేయాలన్న విపక్షాలు  

ఉభయ సభలు సోమవారానికి వాయిదా  

న్యూఢిల్లీ:  పార్లమెంట్‌ ఉభయసభల్లో ప్రతిష్టంభనకు తెరపడడం లేదు. అధికార, ప్రతిపక్షాలు మెట్టు దిగకపోవడంతో లోక్‌సభ, రాజ్యసభలో కార్యకలాపాలు స్తంభిస్తున్నాయి. పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు పునఃప్రారంభమైనప్పటి నుంచీ ఇదే పరిస్థితి. వరుసగా ఐదో రోజు శుక్రవారం సైతం అరుపులు కేకలతో ఉభయసభలు దద్దరిల్లాయి.

భారత ప్రజాస్వామ్యాన్ని విదేశీ గడ్డపై కించపర్చిన కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ క్షమాపణ చెప్పాలని అధికార బీజేపీ సభ్యులు, అదానీ ఉదంతంపై జాయింట్‌ పార్లమెంటరీ కమిటీ(జేపీసీ) ఏర్పాటు చేయాలని ప్రతిపక్ష సభ్యుల డిమాండ్‌ చేశారు. ఎవరూ పట్టు వీడకపోవడంతో అర్థవంతమైన చర్చలకు తావు లేకుండా పోయింది.

అధికార, ప్రతిపక్షాల అజెండాలదే పైచేయిగా మారింది. దాంతో మరో దారిలేక ఉభయ సభలను సభాపతులు సోమవారానికి వాయిదా వేయాల్సి వచ్చింది. బడ్జెట్‌ సమావేశాలు ఈ నెల 13న పునఃప్రారంభమైన సంగతి తెలిసిందే. గత ఐదురోజులుగా లోక్‌సభ, రాజ్యసభలో కార్యకలాపాలేవీ సాగలేదు.  

స్పీకర్‌ విజ్ఞప్తి బేఖాతర్‌   
లోక్‌సభ శుక్రవారం ఉదయం ప్రారంభమైన వెంటనే ప్రతిపక్ష కాంగ్రెస్‌ సభ్యులు వెల్‌లోకి ప్రవేశించారు. తమ పార్టీ నేత రాహుల్‌ గాంధీకి సభలో మాట్లాడే అవకాశం కల్పించాలని డిమాండ్‌ చేస్తూ బిగ్గరగా నినాదాలు మొదలుపెట్టారు. అదానీ గ్రూప్‌ అక్రమాలపై విచారణ కోసం ప్రభుత్వం జేపీసీ ఏర్పాటు చేయాల్సిందేనని పునరుద్ఘాటించారు. అధికార బీజేపీ సభ్యులు తమ సీట్ల వద్దే లేచి నిల్చున్నారు. రాహుల్‌ గాంధీ క్షమాపణ చెప్పాలంటూ నినాదాలు ప్రారంభించారు.

దాంతో దాదాపు 20 నిమిషాలపాటు సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. సభకు సహకరించాలంటూ స్పీకర్‌ ఓం బిర్లా పదేపదే కోరినప్పటికీ ఎవరూ శాంతించలేదు. అలజడి సృష్టించడానికి ప్రజలు మిమ్మల్ని ఇక్కడికి పంపించలేదు, అందరికీ మాట్లాడే అవకాశం ఇస్తా, సభ సజావుగా నడిచేందుకు సహకరించాలి అని స్పీకర్‌ విజ్ఞప్తి చేశారు. సభ్యులెవరూ వినిపించుకోకపోవడంతో సభను ఈ నెల 20వ తేదీ వరకూ వాయిదా వేస్తున్నట్లు స్పీకర్‌ ప్రకటించారు.  

రాజ్యసభలోనూ అదే పునరావృతం   
ఎగువ సభలోనూ గందరగోళం కొనసాగింది. కార్యకలాపాలేవీ సాగకుండానే సభ సోమవారానికి వాయిదా పడింది. అదానీ అంశంపై జేపీసీ ఏర్పాటు చేయాలని విపక్ష సభ్యులు కోరగా, రాహుల్‌ గాంధీ క్షమాపణ చెప్పాలని అధికార పక్ష సభ్యులు డిమాండ్‌ చేశారు. ఇరుపక్షాల ఎంపీలు నినాదాలతో హోరెత్తించారు. రూల్‌ 267 కింద 11 వాయిదా తీర్మానాల నోటీసులు వచ్చాయని, వాటిని అనుమతించడం లేదని చైర్మన్‌ జగదీప్‌ ధన్‌ఖడ్‌ తేల్చిచెప్పారు.

సభలో తాను మాట్లాడేందుకు అనుమతి ఇవ్వాలని ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే కోరగా, చైర్మన్‌ నిరాకరించారు. అధికార, విపక్ష సభ్యులు నినాదాలు కొనసాగిస్తుండడంతో సభను సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు వెల్లడించారు. అంతకంటే ముందు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి  వి.మురళీధరన్‌ సభలో ఒక ప్రకటన చేశారు. ఈ నెల 20 నుంచి రాజ్యసభలో వివిధ కీలక శాఖల పనితీరుపై చర్చించనున్నట్లు తెలిపారు.  

అదొక కొత్త టెక్నిక్‌: థరూర్‌
సంసద్‌ టీవీలో సౌండ్‌ను మ్యూట్‌ చేయడం ఒక కొత్త టెక్నిక్‌ అని   కాంగ్రెస్‌ ఎంపీ శశి థరూర్‌ ఎద్దేవా చేశారు. సభలో ఇకపై ఒక్కో సభ్యుడి మైక్రోఫోన్‌ను ఆపేయాల్సిన అవసరం లేదని, ప్రత్యక్ష ప్రసారంలో శబ్దాలను మ్యూట్‌ చేస్తే సరిపోతుందని ట్విట్టర్‌లో పేర్కొన్నారు. లోక్‌సభలో తమ పార్టీ సభ్యుల గొంతు నొక్కేశారని ఆరోపిస్తూ కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జైరామ్‌ రమేశ్‌ ట్వీట్‌ చేశారు. సభలో వారు చేసిన నినాదాలు ప్రత్యక్ష ప్రసారంలో వినిపించకుండా చేశారని విమర్శించారు. అయితే, సాంకేతిక సమస్యల వల్లే సభ్యుల నినాదాలు వినిపించలేదని పార్లమెంట్‌ వర్గాలు వెల్లడించాయి.  

మోదీ, అదానీ బంధమేంటి?: ప్రియాంక
ప్రధాని మోదీకి, అదానీకి మధ్య సంబంధం ఏమిటో చెప్పాలని కాంగ్రెస్‌ పార్టీ నేత ప్రియాంకాగాంధీ వాద్రా నిలదీశారు. అదానీపై వచ్చిన ఆరోపణలపై ఎందుకు దర్యాప్తు జరిపించడం లేదని నిలదీశారు. ఈ మేరకు ఆమె శుక్రవారం ట్వీట్‌ చేశారు. మోదీ, అదానీ బంధంపై వెల్లువెత్తుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా బీజేపీ మౌనం పాటిస్తోందని తప్పుపట్టారు.   

గాంధీ విగ్రహం వద్ద విపక్షాల ధర్నా
అదానీ వ్యవహారంపై నరేంద్ర మోదీ ప్రభుత్వ వైఖరికి నిరసనగా ప్రతిపక్ష నేతలు శుక్రవారం పార్లమెంట్‌ ప్రాంగణంలో గాంధీ విగ్రహం వద్ద ఉమ్మడిగా ధర్నా చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అదానీ అంశంపై విచారణకు జేపీసీ ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. ఈ మేరకు ప్లకార్డులు, బ్యానర్లు ప్రదర్శించారు. పార్లమెంట్‌ ఉభయసభలు వాయిదా పడిన తర్వాత జరిగిన ఈ ధర్నాలో కాంగ్రెస్‌ ఎంపీలు సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే, రాహుల్‌ గాంధీతోపాటు డీఎంకే, ఆప్, శివసేన(యూబీటీ), జేఎంఎం, బీఆర్‌ఎస్, సీపీఎం, సీపీఐ  పార్టీల ఎంపీలు పాల్గొన్నారు. ధర్నా కంటే ముందు ప్రతిపక్ష నేతలు మల్లికార్జున ఖర్గే చాంబర్‌లో భేటీ అయ్యారు. ప్రభుత్వంపై ఉమ్మడిగా నిరసన తెలపాలని నిర్ణయించారు. అదానీ అంశంపై జేపీసీ ఏర్పాటు చేయాలని ఖర్గే ట్విట్టర్‌లో కోరారు.

మరిన్ని వార్తలు