అతడికి చేతులు లేవు కానీ.. రాయడం ఆపలేదు

3 Aug, 2021 01:07 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

లక్నో: తుషార్‌ విష్వకర్మకు పుట్టుకతోనే రెండు చేతులూ లేవు కానీ అతడికి తన ఇద్దరు సోదరులతో కలిసి బడికి వెళ్లి చదువుకోవాలని ఉండేది. కసితో కాళ్లతో రాయడం ప్రాక్టీస్ చేశాడు. రాయడం నేర్చుకుని స్కూల్‌లోనూ చేరాడు. అలా రాస్తూనే అన్ని తరగతులూ పాసయ్యాడు. వివరాల్లోకెళ్తే.. లక్నోకి చెందిన తుషార్ క్రియేటివ్ కాన్వెంట్లో 12వ తరగతి చదువుతున్నాడు. ప్రస్తుతం అతను సీబీఎస్‌ఈ విడుదల చేసిన ఫలితాల్లో 70 శాతం మార్కులతో పాసయ్యాడు. ఏ లోపం లేని ఎంతో మంది విద్యార్ధులు పాసైతే చాలు అనుకుంటుంటే తుషార్‌ మాత్రం 70 శాతం మార్కులు సాధించి అందరికీ ఆదర్శంగా నిలిచాడు. అంతే కాదు పరీక్షల సమయంలో ప్రభుత్వం అంగవైకల్యంతో బాధపడే విద్యార్ధులకు కల్పించే రైటర్ సహాయం తీసుకోవడం లేదా అధిక సమయం తీసుకోవడం వంటి బెనిఫిట్స్‌ను కూడా ఏనాడూ వినియోగించుకోలేదు. అడిగితే నేను అందరిలాంటి సాధారణ వ్యక్తినని అందుకే నేను అందరిలానే పరీక్ష రాస్తానని అంటున్నాడు తుషార్‌.

తుషార్‌ మాట్లాడుతూ: చిన్నప్పుడు మా అన్నలు ఇద్దరూ స్కూల్‌కి వెళ్తుంటే నేనూ వారితో వెళ్తానని తల్లిదండ్రులను అడిగే వాడిననీ అన్నారు. అయితే తన లోపం వల్ల రాయడం ఇబ్బందిగా ఉండేదని అయితే తన అన్నల పుస్తకాల సాయంతో కాళ్లతో రాయడం ప్రాక్టీస్‌ చేసి తను దానిని అధిగమించడానికి తనకు ప్రతి రోజూ ఆరు గంటల సమయం పట్టేదని చెప్తున్నాడు. అలాగే తను ఈ స్థాయికి చేరుకునేలా ప్రోత్సహించిన తన తల్లిదండ్రులకు, అన్నలకు, ముఖ్యంగా టీచర్లకు ధన్యవాదాలు తెలియజేశారు.
 

>
మరిన్ని వార్తలు