రూ.2 కోట్లిస్తే వదిలేస్తాం.. 

30 Aug, 2020 06:47 IST|Sakshi
(ఎడమ చిత్రం) కాల్పుల్లో గాయపడిన కిడ్నాపర్‌ మహ్మద్, (కుడి) బాలునితో తల్లి, పోలీసులు 

బెంగళూరులో బాలుడు కిడ్నాప్‌

భారీగా బేరం పెట్టిన దుండగులు

ఆటకట్టించిన పోలీసులు

శివాజీనగర(బెంగుళూరు): 11 ఏళ్ల బాలున్ని కిడ్నాప్‌ చేసి రూ.2 కోట్లు డిమాండ్‌ పెట్టిన ఐదుమంది కిడ్నాపర్లు కటకటాలు లెక్కిస్తున్నారు. కిడ్నాపర్ల ముఠా నాయకుడు మహ్మద్‌ ఝన్‌ పోలీసు కాల్పుల్లో గాయపడ్డాడు. తూర్పు విభాగ పోలీసులు 16 గంటల్లో కేసును ఛేదించారు. వివరాలు.. భారతీనగరకు చెందిన బట్టల వ్యాపారి కుమారుడు  ఈ నెల 27న ఇంటి ముందు ఆడుకుంటుండగా కిడ్నాపర్లు అపహరించారు. తల్లిదండ్రులు భారతీననగర పోలీస్‌స్టేషన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. డీసీపీ శరణప్ప ఆధ్వర్యంలో పులకేశీనగర ఏసీపీ తబారక్‌ ఫాతిమా, సీఐ సిరాజుద్దీన్‌ తదితరులు గాలింపు చేపట్టారు.

కూల్‌డ్రింకులో మత్తు కలిపి  
దండగులు 27వ తేదీ అర్ధరాత్రి బాలుని తల్లిదండ్రులకు ఫోన్‌ చేసి రూ.2 కోట్లు ఇస్తే వదిలిపెడతామని, పోలీసులకు గానీ, ఇతరులకు గానీ చెబితే బాలున్ని హతమారుస్తామని బెదిరించారు. ఆ వ్యాపారి బట్టల షాపుకి అప్పుడప్పుడు వచ్చే మహ్మద్‌ ఝున్‌ ధనాశతో ఈ కిడ్నాప్‌కి ఒడిగట్టాడు. బాలునికి గాలిపటం కొనిస్తానని ఆశపెట్టి కారులో తీసుకెళ్లారు, అతడు అరవకుండా కూల్‌డ్రింకులో మత్తుమాత్రలు వేసి తాగించడంతో మత్తులోకి జారుకున్నాడు. తుమకూరు పరిసర ప్రాంతాల నుంచి ఫోన్లు చేయసాగారు. పోలీసులు రంగంలోకి దిగి నగదు ఇస్తామని తల్లిదండ్రులతో చెప్పించారు. తల్లిదండ్రులు, వారికి కొంచెం దూరంలో పోలీసులు తుమకూరుకు బయల్దేరారు. మార్గమధ్యంలో చిన్నారితో వెళ్తున్న కారును గుర్తించి  అడ్డుకోవడానికి యత్నించగా దుండగులు వేగంగా కారును పోనిచ్చారు. సుమారు 15 కి.మీ.దూరం వరకు చేజింగ్‌ సాగింది. తుమకూరు గౌతమనహళ్లి వద్ద కిడ్నాపర్ల కారు బోల్తా పడింది. వెంటనే పోలీసులు బాలున్ని కాపాడి నిందితులైన ఫాహిం, ముజామిల్, ఫైజాన్, మహమ్మద్‌ షాహీద్, ఖలీల్‌ను అరెస్టు చేశారు. 

కాల్పుల్లో సూత్రధారికి గాయాలు
ప్రధాన నిందితుడు మహ్మద్‌ మరోచోట ఉన్నాడని తెలిసి గాలింపు చేపట్టారు. శనివారం తెల్లవారుజామున శాంపుర మెయిన్‌ రోడ్డులో ఉన్నట్లు తెలిసి పట్టుకోవడానికి యత్నించగా దాడి చేయడంతో పోలీసులు కాల్పులు జరిపారు. దీంతో మహ్మద్‌ ఝన్‌ కాలికి గాయమైంది. వెంటనే అతన్ని పట్టుకుని ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది.

మరిన్ని వార్తలు