భగత్‌ సింగ్‌ ఉరి సన్నివేశం రిహార్సల్‌ విషాదం

31 Jul, 2021 11:36 IST|Sakshi

లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని బుడౌన్‌లోని బాబాత్ గ్రామంలో భగత్ సింగ్ ఉరి వేసే సన్నివేశాన్ని రిహార్సల్ చేస్తుండగా.. 9 ఏళ్ల  బాలుడు మరణించాడు. వివరాల్లోకి వేళితే.. భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్‌లు దేశం కోసం ప్రాణాలు అర్పించిన సంగతి తెలిసిందే. అయితే ఈ స్వాతంత్ర్య సమరయోధుల జీవితం ఆధారంగా ఒక నాటకం కోసం యూపీలోని పాఠశాల విద్యార్థులు రిహార్సల్ చేస్తున్నారు. ఇందులో భాగంగా శివమ్‌(9) అనే బాలుడు భగత్‌ సింగ్‌ పాత్రను పోషించాలనుకున్నాడు. బాలుడు స్నేహితులతో కలిసి అతని ఇంటి ప్రాంగణంలో రిహార్సల్‌ చేయడం మొదలు పెట్టారు.

నాటకం చివరి సన్నివేశం కోసం శివమ్ ఒక తాడును తీసుకొని ఓ ఉచ్చును రూపొందించాడు. దాన్ని అతని మెడ చుట్టూ తగిలించుకున్నాడు. కానీ ప్రమాదావశాత్తు అతని పాదాలు స్టూల్‌ నుంచి జారిపోవడంతో ఉరి బిగుసుకుంది. ఆ సమయంలో అతడు ఊపిరి తీసుకోవడానికి చాలా ఇబ్బంది పడ్డాడు. అయితే అతడి స్నేహితులు ఇదంతా యాక్టింగ్‌ అనుకున్నారు. ఇంతలో శరీరంలో కదలికలు లేకపోయే సరికి పిల్లలు భయపడి అరిచారు. దీంతో స్థానికులు వచ్చి శివమ్‌ను కిందికి దించారు. కానీ అతడు అప్పటికే ప్రాణాలు కోల్పోయాడు. కాగా  గత సంవత్సరం కూడా మధ్యప్రదేశ్‌లోని మందసౌర్ జిల్లాలో భగత్ సింగ్ ఉరిశిక్ష రిహార్సల్‌ చేస్తూ ఓ బాలుడు మరణించాడు.

మరిన్ని వార్తలు