బ్రహ్మకుమారీస్‌ చీఫ్‌ దాది ఇక లేరు

12 Mar, 2021 03:12 IST|Sakshi

జైపూర్‌: బ్రహ్మకుమారీస్‌ చీఫ్‌ అడ్మినిస్ట్రేటర్‌ 93 ఏళ్ళ రాజయోగిని దాది హృదయ్‌ మోహిని గురువారం ముంబైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో కన్ను మూశారు. గత పదిహేను రోజులుగా అనారోగ్య కారణాలతో ముంబైలోని సైఫీ ఆసుపత్రిలో మోహిని చికిత్స పొందుతున్నారని ఆధ్యాత్మిక సంస్థ అధికార ప్రతినిధి చెప్పారు. బ్రహ్మకుమారీస్‌ మాజీ చీఫ్‌ దాది జానకి ఏడాది క్రితం మరణించిన తరువాత మోహినిని చీఫ్‌గా నియమించారు. అబు రోడ్‌లోని బ్రహ్మకుమారీస్‌ హెడ్‌క్వార్టర్స్‌లో మోహిని భౌతిక కాయాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచనున్నట్టు వారు తెలిపారు. మార్చి 13న మోహిని అంత్యక్రియలు నిర్వహించనున్నారు. దాది మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ తమ ప్రగాఢ సంతాపం వ్యక్తంచేశారు. రాజయోగిని దాది గుల్జార్‌ ఆకా హృదయ మోహిని ప్రజాపీఠ బ్రహ్మకుమారీస్‌ ప్రపంచ ఆధ్యాత్మిక విశ్వవిద్యాలయం ప్రధాన పాలనాధికారి.

దాదా లేఖ్‌రాజ్‌(ఆ తరువాత బ్రహ్మ బాబాగా పేరు మార్చుకున్నారు) స్థాపించిన ‘ఓం నివాస్‌’ అనే బోర్డింగ్‌ స్కూల్‌లో 1936లో ఎనిమిదేళ్ల వయసులోనే దాది గుల్జార్‌ యజ్ఞ(సంస్థ)లో దాది హృదయ మోహిని చేరారు. చిన్న వయస్సులోనే ఎంతో అనుభవాన్ని ఆర్జించిన దాది మోహిని, ఉన్నత విలువల కోసం ఎంతో కృషి చేశారు. రాజయోగినిగా తన జీవితాన్ని ఆధ్యాత్మికతకు అంకితం చేసిన దాది మోహిని ఆధ్యాత్మిక, బోధనా విలువలకు పెట్టిందిపేరు. అతిచిన్న వయస్సు నుంచే ఆమె చేసిన సేవ, చూపిన త్యాగనిరతి దాది మోహినిని ఇప్పుుడు అత్యున్నత స్థానంలో నిలిపింది. మానసిక నిగ్రహం, మానసిక శాంతి, స్థిరత్వం, ధ్యానం లాంటి గుణాల్లో ఆమె సాధించిన విజయం ఆమెను గొప్ప యోగినిగా నిలబెట్టాయి.  అనేక దేశాల ఆహ్వానంమేరకు దాది మోహిని తూర్పునుంచి పశ్చిమం వరకు ఎన్నో దేశాలను సందర్శించారు. ఆస్ట్రేలియా, జపాన్, న్యూజిలాండ్, ఫిలిప్పీన్స్, హాంగ్‌కాంగ్, సింగపూర్, మలేసియా, ఇండోనేíసియా, శ్రీలంక, అమెరికా, బ్రెజిల్, మెక్సికో, కెనడా, యూకే, జర్మనీ, ఫ్రాన్స్, హాలాండ్, పోలండ్, రష్యా తదితర దేశాలెన్నింటికో వెళ్ళి తన బోధనలను వినిపించారు. ఆధ్యాత్మికతకు సంబంధించిన ఫిలాసఫీ, రాజ్‌యోగ లాంటి అనేక అంశాల్లో ఆమె అనర్గళంగా ఉపన్యాసాలు ఇచ్చేవారు.

మరిన్ని వార్తలు