తాను మరణిస్తూ ఐదుగురి జీవితాల్లో వెలుగులు

21 Jul, 2022 07:33 IST|Sakshi

చెన్నై: మరణంలోనూ జీవనం! అవయవ దానం ఉద్దేశం ఇదే. మరణించిన తర్వాత మరొకరి జీవితాన్ని నిలబెడుతుంది. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి బ్రెయిన్‌ డెడ్‌గా మారిన ఓ 19 ఏళ్ల విద్యార్థి తాను మరణిస్తూ ఐదుగురి జీవితాల్లో వెలుగులు నింపారు. తమిళనాడు, చెన్నెలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో బుధవారం ఐదుగురికి ఆ యువకుడి అవయవాలు అమర్చారు. 

చెన్నై శివారులోని ఆర్టేరియల్‌ గ్రాండ్‌ సౌథర్న్‌ ట్రంక్‌ రోడ్డుపై నెల రోజుల క్రితం జరిగిన ప్రమాదంలో చెన్నైకి చెందిన ఓ విద్యార్థి తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే ఆ యువకుడిని స్థానికంగా ఉండే ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత రేలా ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే.. వైద్యులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఆ యువకుడు బ్రెయిన్‌ డెడ్‌ అయినట్లు వెల్లడించారు. అయినప్పటికీ అతడి ఇతర అవయవాలు పని చేస్తున్నాయని చెప్పారు. ఆసుపత్రికి చెందిన సామాజిక కార్యకర్తలు విద్యార్థి కుటుంబ సభ్యులకు అవయవదానంపై అవగాహన కల్పించారు. దీంతో వారు అందుకు అంగీకరించారు. ఐదుగురి జీవితాల్లో వెలుగులు నింపారు. 

బ్రెయిన్‌ డెడ్‌ టీనేజర్‌కు చెందిన అవయవాలను ఇతరులకు అమర్చేందుకు తమిళనాడు ప్రభుత్వం సైతం అనుమతి ఇచ్చిందని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.‘ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఇద్దరు రోగులకు కిడ్నీ, గుండె అమర్చాం. మరో ముగ్గురికి ఓ కిడ్నీ, రెండు ఊపిరితిత్తులు, కాలేయం మార్చాం.’ అని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. మరోవైపు.. అవయవదానంలో తమిళనాడు ముందంజలో ఉందని, అందుకు చాలా గర్వంగా ఉందని తెలిపారు ట్రాన్ట్సాన్‌ సభ్యులు ఆర్‌ కాంతిమతి. అవయవదానం చేసేందుకు ముందుకు వచ్చిన కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.

ఇదీ చదవండి: Viral Video: త్రుటిలో తప్పిన ప్రాణాపాయం.. మహిళ వీడియో వైరల్‌

మరిన్ని వార్తలు