బ్రెజిల్‌లో కోవాగ్జిన్‌ క్లినికల్‌ పరీక్షలు రద్దు

25 Jul, 2021 05:13 IST|Sakshi

భారత్‌ బయోటెక్‌కు ఎదురుదెబ్బ

హైదరాబాద్‌: భారత్‌ బయోటెక్‌కు చెందిన కోవాగ్జిన్‌ కరోనా వ్యాక్సిన్‌ క్లినికల్‌ పరీక్షలను బ్రెజిల్‌లో రద్దు చేస్తున్నట్లు ఆ దేశ ఆరోగ్య వ్యవహారాల నియంత్రణ విభాగం శనివారం ప్రకటించింది. బ్రెజిల్‌ మార్కెట్లోకి కోవాగ్జిన్‌ను తీసుకొచ్చేందుకు అక్కడి ప్రెసికా మెడికమెంటోస్, ఎన్‌విక్సా పార్మాస్యూటికల్స్‌ ఎల్‌.ఎల్‌.సీతో చేసుకున్న అవగాహన ఒప్పందం(ఎంవోయూ)ను రద్దుచేసుకున్నట్లు భారత్‌ బయోటెక్‌ శుక్రవారం ప్రకటించిన సంగతి తెల్సిందే.

బ్రెజిల్‌కు ఈ ఏడాది రెండో, మూడో త్రైమాసికాల్లో 2 కోట్ల డోస్‌ల కోవాగ్జిన్‌ టీకాలను సరఫరా చేసే ఒప్పందంలో భారీ స్థాయిలో అవినీతి చోటుచేసుకుందనే వార్తల నేపథ్యంలో ఈ ఎంవోయూ రద్దయింది. టీకా సరఫరాలో ముడుపులు, అవకతవకల ఆరోప ణలపై బ్రెజిల్‌ సెనెట్‌ దర్యాప్తునకు ఆదేశించడం తెల్సిందే. ఒప్పందం రద్దుపై బ్రెజిల్‌ జాతీయ ఆరోగ్య నియంత్రణ సంస్థ (ఏఎన్‌వీఐఎస్‌ఏ)కు భారత్‌ బయోటెక్‌ ఓ లేఖ రాయడంతో క్లినికల్‌ పరీక్షలు  రద్దుచేశారు. బ్రెజిల్‌లో భారత్‌ బయోటెక్‌కు ప్రెసికా మెడికమెంటోస్‌ సంస్థ భాగస్వామిగా వ్యవహరించింది. అనుమతి పత్రాల సమర్పణ, స్థానికంగా తోడ్పాటు, లైసెన్స్, పంపిణీ, ఇన్సూరెన్స్, మూడో దశ క్లినికల్‌ పరీక్ష తదితర బాధ్యతలను ప్రెసికా మెడికమెంటోస్‌ చూసుకునేది. ఇంత వరకూ బ్రెజిల్‌లో కోవాగ్జిన్‌ పరీక్షలు చేపట్టనేలేదు.

మరిన్ని వార్తలు