థర్డ్‌ వేవ్‌కు మార్కెట్లే హాట్‌స్పాట్లా? 

6 Jul, 2021 00:40 IST|Sakshi
ఢిల్లీలోని సరోజిని మార్కెట్‌లో కోవిడ్‌ ఆంక్షలను గాలికొదిలేసి తిరుగుతున్న జనం

ఢిల్లీలో కోవిడ్‌ ప్రోటోకాల్స్‌ పట్ల ప్రజల అలసత్వం 

షాపింగ్‌పైనే ప్రజల దృష్టి  

అలర్టయిన రాష్ట్ర ప్రభుత్వం 

కొన్ని మార్కెట్ల మూసివేతకు చర్యలు

సాక్షి, న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి సెకండ్‌ వేవ్‌లో తీవ్రంగా ప్రభావితమైన దేశ రాజధాని ఢిల్లీలో నెల రోజులుగా పరిస్థితులు కాస్త కుదుటపడుతున్నాయి. ప్రస్తుతం ఢిల్లీలో రోజువారీగా పాజిటివ్‌ కేసులు దాదాపు వందలోపే నమోదవుతున్నాయి. కేసుల సంఖ్యలో గణనీయమైన తగ్గుదల నమోదు కావడంతో లాక్‌డౌన్‌ సమయంలో కరోనా భయంతో ఇళ్లకే పరిమితమైన ఢిల్లీ వాసుల వ్యవహారశైలిలో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. కేసులు తగ్గుముఖం పట్టినప్పటికీ, దశల వారీగా అన్‌లాక్‌ ప్రక్రియ జరుగుతున్న సమయంలో ప్రతీ ఒక్కరు తప్పనిసరిగా మాస్క్‌ ధరించడం, భౌతిక దూరాన్ని పాటించడంతో పాటు రద్దీ ఉండే ప్రదేశాలకు వెళ్లరాదన్న ప్రోటోకాల్స్‌ను చాలామంది తుంగలో తొక్కేస్తున్నారు. కరోనా వచ్చే ముందు ఏవిధంగా ఢిల్లీలోని మార్కెట్లు కిటకిటలాడాయో, ఇప్పుడూ అవే దృశ్యాలు కనిపిస్తున్నాయి. వీటిని చూస్తుంటే ప్రజల్లో కరోనా పట్ల భయం ఏమాత్రం లేదన్నదని స్పష్టంగా అర్థమౌతోంది.      

దేశవ్యాప్తంగా సెప్టెంబర్‌–అక్టోబర్‌ నెలల్లో కరోనా మూడో వేవ్‌ వస్తుందనే అంచనాలపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అదే సమయంలో డెల్టా ప్లస్‌ వేరియంట్‌ కారణంగా రాబోయే కొద్ది నెలల్లో దేశంలో మూడో వేవ్‌ వచ్చే అవకాశాలున్నాయని పరిశోధకులు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ఊహాగానాల మధ్య ప్రజలు తమ షాపింగ్‌ ఆసక్తిని ఏమాత్రం తగ్గించుకోవట్లేదనేది ఇక్కడ పరిశీలించాల్సిన అంశం. 

ఢిల్లీలో అన్‌లాక్‌ ప్రక్రియ ప్రారంభమై, మార్కెట్లు తెరుచుకున్నప్పటి నుంచి షాపింగ్‌కు వెళ్లే ప్రజల సంఖ్య రోజు రోజుకీ పెరుగుతోంది. దీంతో లజ్‌పత్‌నగర్, సరోజిని నగర్, సదర్‌ బజార్‌తో సహా ఢిల్లీలోని అనేక మార్కెట్లలో కోవిడ్‌ ప్రోటోకాల్స్‌ పాటించే విషయంలో జరుగుతున్న నిర్లక్ష్యం, ప్రజల అలసత్వం కారణంగా ఇవి మూడో వేవ్‌కు హాట్‌స్పాట్‌లుగా మారే అవకాశాలున్నాయని అంచనా వేస్తున్నారు. గత నెలలో జరిగిన ఒక విచారణ సందర్భంగా, ఢిల్లీ హైకోర్టు సైతం కోవిడ్‌ విషయంలో మార్కెట్లలో నెలకొన్న నిర్లక్ష్యంపై పదునైన వ్యాఖ్యలు చేసింది. దీంతో జనసాంద్రత ఎక్కువగా ఉండే జనపథ్‌ , కన్నాట్‌ ప్లేస్‌ , కరోల్‌బాగ్, సరోజిని నగర్, సదర్‌ బజార్‌ ,లజ్‌పత్‌ నగర్, చాందిని చౌక్, ఐఎన్‌ఏ మార్కెట్, పట్‌పడ్‌ గంజ్, లక్ష్మీ నగర్‌ వంటి మార్కెట్లపై ఢిల్లీ ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఈ మార్కెట్లలో ప్రజలు భౌతిక దూరం పాటించే పరిస్థితి మాత్రం కనిపించదు. ఇలాంటి పరిస్థితి ఎదురైతే ఈ మార్కెట్లు కరోనా హాట్‌స్పాట్లుగా మారే అవకాశాలున్నాయని ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ అన్‌లాక్‌–1 ప్రకటన సందర్భంగా వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఈ మార్కెట్లే కాక మంగోల్‌పురి, మధు విహార్, త్రినగర్, పహాడ్‌గంజ్‌ మెయిన్‌ బజార్, పాత ఢిల్లీ మార్కెట్, సఫ్దర్‌జంగ్‌ మార్కెట్‌ సమీపంలోని దక్షిణ ఢిల్లీ మార్కెట్, ఇండియా గేట్‌ సమీపంలోని న్యూ ఢిల్లీ మార్కెట్, కన్నాట్‌ ప్లేస్‌ ఎదురుగా ఉన్న ఎం బ్లాక్‌ మార్కెట్, డిఫెన్స్‌ కాలనీ దగ్గర ఉన్న దక్షిణ ఢిల్లీ మార్కెట్‌లలో కోవిడ్‌ ప్రోటోకాల్స్‌ పాటించే విషయంలో ఇప్పటికే హెచ్చరికలు జారీ అయ్యాయి. 

లజ్‌పత్‌ నగర్‌ మార్కెట్‌ మూసివేత
కోవిడ్‌ నియమాలను పాటించని కారణంగా లజ్‌పత్‌నగర్, సరోజిని నగర్‌ సహా ఇతర మార్కెట్ల మూసివేతపై ఢిల్లీ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ అథారిటీ (డీడీఎంఏ) నోటీసులు జారీ చేసింది. ఈ మార్కెట్లో కోవిడ్‌ ప్రోటోకాల్స్‌ పాటించకపోవడమే కాకుండా, వందలాది మంది విక్రేతలు మార్కెట్‌లో అక్రమంగా వస్తువులను విక్రయిస్తున్నారని స్థానిక దుకాణాదారులు ఎన్‌డీఎంసీకి లేఖ రాశారు. అదే సమయంలో ఢిల్లీలోని అన్ని జిల్లాల అధికారులకు అందుతున్న ఫిర్యాదుల మేరకు కోవిడ్‌ ప్రోటోకాల్స్‌ పాటించని మార్కెట్లు, షాపులపై దాడి చేసి సీల్‌ చేస్తున్నారు. అయితే మూడో వేవ్‌ ఊహాగానాల నేపథ్యంలో కరోనా వ్యాప్తిని అపే విషయంలో పాలనా యంత్రాంగం, వ్యాపారస్థుల ముందు పెద్ద సవాలు ఉంది. దుకాణదారులు వ్యాపారంతో పాటు కరోనా సంక్రమణ నివారణపై దృష్టిపెట్టాలని అధికారులు సూచిస్తున్నారు. మార్కెట్లలో నిబంధనలను కచ్చితంగా పాటించాలని హెచ్చరిస్తున్నారు. ఆరోగ్య శాఖ గణాంకాల ప్రకారం ఢిల్లీలో ఇప్పటివరకు 14,34, 608 కరోనా కేసులు నమోదయ్యాయి. అందులో 14,08,699 మంది రోగులు నయమయ్యారు. రికవరీ రేటు 98.18 శాతంకు చేరింది. అదే సమయంలో, మృతుల సంఖ్య 24,997కు పెరిగింది. ఢిల్లీలో కంటైన్మెంట్‌ జోన్ల సంఖ్య 695కి చేరింది.

మరిన్ని వార్తలు