-

తాళి కట్టే సమయానికి కుప్పుకూలిన వధువు.. ఆ తర్వాత భలే ట్విస్ట్‌.. వీడియో వైరల్‌

23 May, 2022 08:01 IST|Sakshi

మైసూరు:  రెండు నిమిషాల్లో వరుడు తాళి కట్టాల్సి ఉంది. ఇంతలో పెళ్లికూతురు కళ్లు తిరిగి పడిపోయింది. వెంటనే కొందరు నీళ్లు చల్లి కూర్చోబెట్టారు. వరుడు తాళి కట్టేందుకు సిద్ధం కాగా, వధువు వీల్లేదని మొండికేసింది. ఈ విడ్డూరం మైసూరు నగరంలోని విద్యాభారతి కళ్యాణ మండపంలో ఆదివారం చోటుచేసుకుంది. 

వివరాల ప్రకారం.. హెచ్‌డీ కోటెకు చెందిన యువకునితో మైసూరుకు చెందిన సించన అనే యువతికి పెద్దలు ఇటీవలే నిశ్చితార్థం చేశారు. కాగా, పెళ్లి వేడుకలో వధువు అడ్డం తిరిగింది. ఈ పెళ్లి ఎంతమాత్రం ఇష్టం లేదని,  తాను ఇంటి పక్కన ఉన్న యువకున్ని ప్రేమించానని, అతనితోనే మూడుముళ్లు వేసుకుంటానని చెప్పడంతో వధూవరుల తల్లిదండ్రులు ఒక్కసారిగా షాకయ్యారు. 

ఇప్పుడు పెళ్లి వద్దంటే ఎలా?, తాము ఈ పెళ్లి కోసం రూ. 5 లక్షలకు పైగా ఖర్చు చేశామని, తమ డబ్బులు తిరిగి ఇవ్వాలని పెళ్లకొడుకు తల్లిదండ్రులు పట్టుబట్టారు.  దీంతో, స్థానిక పోలీసులు వచ్చి వధువుకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా ఆమె వినలేదు.  దీంతో వధూవరులను పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఎవరు చెప్పినా వినేది లేదని, ప్రేమించినవాడినే పెళ్లి చేసుకుంటానని పెళ్లికూతురు భీష్మించడంతో ఖాకీలు సైతం ఏమీ చేయలేకపోయారు.  

ఇది కూడా చదవండి: బాలికను కాళ్లతో తన్నుతూ ఆనందం పొందాడు.. వీడియో వైరల్‌ కావడంతో..

మరిన్ని వార్తలు