ఈ పెళ్లి ప్రత్యేకం.. వరుడు చేత బాండ్‌ పేపర్‌పై సంతకం.. మాట తప్పితే తిప్పలే!

20 Mar, 2022 13:26 IST|Sakshi

‘నాతిచరామి’ అంటూ వధూవరులు చేసే వాగ్దానం ప్రతి పెళ్లిలోనూ చూసే తంతే. కానీ ఈ పెళ్లి ప్రత్యేకం. అందుకే హర్షు సంగ్తానీ అనే యువతి పేరు సోషల్‌ మీడియాలో మారుమోగిపోతోంది. హర్షు.. తనకు కాబోయే భర్త కరణ్‌ నుంచి కొన్ని వాగ్దానాలను కోరుకుందట. వాటిని 100 రూపాయల బాండుపై కండిషన్స్‌ అప్లై అంటూ ఐదంటే ఐదు షరుతుల్ని వివరంగా రాయించి, కాబోయే భర్తతో సంతకం పెట్టించుకుంది. దాన్ని లామినేషన్‌ చేయించి కాన్ఫిడెన్షియల్‌ అంటూ దాచి పెట్టుకుంది. ఇంతకీ అందులో ఏం షరతులు ఉన్నాయి? పాపం పెళ్లికొడుకు ఏం బేజారెత్తుతున్నాడో అనుకునేరు! ఆ షరతులు తెలిస్తే నవ్వుకుంటారు.

మొదటి షరతు... ప్రతిరోజూ రాత్రివేళ వరుడు తన దగ్గరే పడుకోవాలట. రెండో షరతు... వెబ్‌ సిరీస్‌ కలిసే చూడాలట. మూడో షరతు.. రోజుకి మూడుసార్లు తనకి ఐలవ్యూ చెప్పాలట. నాలుగో షరతు.. బార్బెక్యూ ఫుడ్స్‌ని ఆమె లేకుండా ఒక్కడే తినకూడదట. ఐదో షరతు... ఆమె ఎప్పుడు ఏది అడిగినా అతను నిజమే చెప్పాలట. ప్రస్తుతం ఈ కాంట్రాక్ట్‌ బాండ్‌ పేపర్‌ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో విపరీతంగా హల్‌చల్‌ చేస్తోంది. దీన్ని ఫిబ్రవరి 20న హర్షు పెళ్లికి మేకప్‌ చేసిన భూమికా సాజ్‌ అకౌంట్‌ నుంచి పోస్ట్‌ చేశారు. హర్షు చాలా సరదా మనిషి అని అదే అకౌంట్‌లో మిగిలిన వీడియోలు చూస్తుంటే అర్థమవుతోంది. ప్రతిచోట ఫుల్‌ జోష్‌తో డాన్స్‌ చేసే హర్షు.. ఏదో సరదగా ఈ కండిషన్స్‌ పెట్టి ఉంటుందని, ఇలాంటి కాంట్రాక్ట్‌ ఇంతకుముందెప్పుడూ చూడలేదంటూ స్పందిస్తున్నారు నెటిజన్లు. అయితే హర్షు మాత్రం తన అకౌంట్‌ని ప్రైవసీగానే ఉంచుకుంది. దాంతో పూర్తి వివరాలు వెలువడలేదు.  

మరిన్ని వార్తలు