వాన ఎఫెక్ట్‌.. పడవలో వధువు, థర్మోకోల్‌ షీట్‌పై వరుడు.. వీడియోలు వైరల్‌

15 Jul, 2022 19:54 IST|Sakshi

దేశవ్యాప్తంగా కొద్దిరోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో నదులు, వాగులు పొంగిపొర్లుతున్నాయి. దీంతో అనేక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలోనే పెళ్లి వేడుకల వంటి శుభాకార్యాలకు ముహుర్తాలు ఉండటంతో వారి కుటుంబ సభ్యులు ఆందోళనకు గురవుతున్నారు. కాగా,గురువారం కోనసీమ జిల్లాలోని లంకపేటకు చెందిన  వధువు నల్లి ప్రశాంతి.. కూడా పడవలో వెళ్లి పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. 

ఈ ఘటన సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్న సమయంలో ఇలాంటి మరో ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. భారీ వర్షాల నేపథ్యంలో రోడ్డు మార్గంలో ప్రయాణం చేయలేని వరుడు పెద్ద సాహసమే చేశాడు. హడ్గావ్​ మండలం కొర్రి గ్రామానికి చెందిన ఓ వరుడు పెళ్లి కోసం థర్మకోల్​ షీట్​ సాయంతో 7 కిలోమీటర్ల దూరంలోని ఉమర్​ఖేడ్ మండలం సంగమ్ చించోలి వరకు నీటిలో ప్రయాణించాడు. అతడితో పాటు బంధువులు సైతం థర్మకోల్​ షీట్ల సాయంతోనే వివాహానికి వెళ్లారు. అనంతరం పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇదిలా ఉండగా.. కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం పెదపట్నంలంక లంకపేటకు చెందిన నల్లి ప్రశాంతికి, మలికిపురం మండలం కేశనపల్లికి చెందిన గంటా అశోక్‌కుమార్‌తో వివాహం నిశ్చయమైంది. గురువారం ఉదయం పెళ్లి కావాల్సి ఉండగా.. పెదపట్నంలంకను గోదావరి వరద చుట్టు ముట్టింది. ఈ నేపథ్యంలో అష్టకష్టాలు పడి పెళ్లి కుమార్తెను అతి ముఖ్యులతో కలిసి పడవపై అప్పనపల్లి కాజ్‌వే వరకు తీసుకువచ్చారు. అక్కడి నుంచి కారులో కేశనపల్లికి చేరుకున్నారు. ముహూర్త సమయానికి కాస్త ఆలస్యమైనా పెళ్లి వేదిక వద్దకు చేరుకోగలిగారు. అనంతరం పెద్దలు పెళ్లి ప్రక్రియ పూర్తి చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 

మరిన్ని వార్తలు