Madikheda Dam: కొట్టుకుపోయిన బ్రిడ్జి, షాకింగ్‌ వీడియో!

4 Aug, 2021 10:32 IST|Sakshi

భోపాల్: వరద ఉద్ధృతికి మధ్యప్రదేశ్‌లోని దాతియా జిల్లాలో రెండు వంతెనలు కొట్టుకుపోయాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల ధాటికి మణిఖేడ ఆనకట్ట నుండి ప్రవహిస్తున్న నీటి వేగానికి వంతెన నదిలో ఒక్కసారిగా కుప్పకూలింది. మణిఖేడ డ్యామ్ 10 గేట్లు ఎత్తడంతో మంగళవారం ఈ సంఘటన చోటు చేసుకుంది. ఈ షాకింగ్‌ వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 

మధ్యప్రదేశ్‌లోని ప్రధాన నగరమైన గ్వాలియర్‌కి అనుసంధానించే మూడింటిలో ఈ వంతెన ఒకటి. అయితే ఇప్పటికే బాధిత గ్రామాలను అప్రమత్తం చేశామని ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌ వెల్లడించారు. వరద బాధితులను అన్నివిధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి సహాయక చర్యలను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. మరోవైపు వరద ప్రభావానికి గురైన రాష్ట్రాన్ని ఆదుకునేందుకు  తగిన సాయం చేస్తామని నరేంద్ర మోదీ  హామీ ఇచ్చారని సీఎం ట్వీట్‌ చేశారు. పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారుతున్ననేపథ్యంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో  సైన్యం సహాయంపై ప్రధాని మోదీతో చర్చించినట్టు ఆయన వెల్లడించారు. 2009లో నిర్మించిన దాతియా-రతన్‌గఢ్ దేవాలయాన్ని కలిపే ఇదే వంతన వద్ద 2013 అక్టోబరులో జరిగిన తొక్కిసలాటలో 115 మంది భక్తులు మరణించారు. 

కాగా భారీ వర్షాలకు రాష్ట్రం  అతలాకుతలముతోంది. రాష్ట్రంలోని పలు జిల్లాలతోపాటు, గ్వాలియర్ చంబల్ ప్రాంతం తీవ్రంగా దెబ్బతింది. వరద ప్రభావిత జిల్లాలలో వైమానిక దళానికి చెందిన అనేక బృందాలు సహాయక చర్యలు చేపడుతున్నాయి. అలాగే శివపురి, ష్యోపూర్, గ్వాలియర్, దాతియా జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఈ జిల్లాలలోని 1100లకు పైగా గ్రామాలు ముంపునకు గురయ్యాయి. ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి.  తొమ్మిదింటికి ఆరెంజ్ అలర్ట్, మరో ఎనిమిది జిల్లాలకు యల్లో అలర్ట్‌ జారీ చేశారు. సహాయ,రక్షణ బృందాలు సహాయ చర్యలను పర్యవేక్షిస్తున్నాయి. 

మరిన్ని వార్తలు