కాంగ్రెస్‌లో మరో ట్విస్ట్‌.. యూపీసీసీ చీఫ్‌గా బ్రిజ్‌లాల్‌ ఖాబ్రీ నియామకం

1 Oct, 2022 16:36 IST|Sakshi

కాంగ్రెస్‌ అధ్యక్ష ఎన్నికల్లో ట్విస్టులు చోటుచేసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానం ఆసక్తికర నిర్ణయం తీసుకుంది. తాజాగా ఉత్తరప్రదేశ్‌ కాంగ్రెస్‌ చీఫ్‌ను నియమించింది. యూపీసీసీ చీఫ్‌గా బ్రిజ్‌లాల్‌ ఖాబ్రీని నియమిస్తున్నట్టు పార్టీ శనివారం ఓ ప్రకటనలో పేర్కొ​ంది. 

ఈ సందర్భంగా కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ.. యూపీలో కాంగ్రెస్‌ కమిటీకి ఆరుగురు రీజినల్‌ హెడ్స్‌ను సైతం నియమించారు.  నసిముద్దీన్ సిద్ధిఖీ, అజయ్ రాయ్, వీరేంద్ర చౌదరి, నకుల్ దూబే, అనిల్ యాదవ్, యోగేష్ దీక్షిత్‌లను రీజినల్‌ హెడ్స్‌గా నియమిస్తున్నట్టు స్పష్టం చేశారు. అయితే, ఇటీవల జరిగిన యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ భారీ ఓటమిని చవిచూసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఓటమికి బాధ్యత వహిస్తూ యూపీ కాంగ్రెస్‌ చీఫ్‌ అజయ్‌ లల్లూ పీసీసీ పదవికి రాజీనామా చేశారు. 

ఇక, కాంగ్రెస్‌ అధ్యక్ష ఎన్నికల బరిలో సీనియర్‌ నేత మల్లికార్జున ఖర్గే, మరో ముఖ్య నేత, ఎంపీ శశిథరూర్‌లు నిలిచారు. కాంగ్రెస్‌ అధ్యక్ష ఎన్నికల కోసం కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కేఎన్‌ త్రిపాఠి(45) కూడా నామినేషన్‌ దాఖలు చేశారు. అయితే, ఆయన నామినేషన్‌ను తిరస్కరిస్తున్నట్లు కాంగ్రెస్‌ కేంద్ర ఎన్నికల సంఘం చైర్మన్‌ మధుసుదన్‌ మిస్ట్రీ వెల్లడించారు. ఆయన సమర్పించిన నామినేషన్‌ పత్రాల సెట్‌ నిబంధనల ప్రకారం లేదని, సంతకాలకు సంబంధించిన సమస్య తలెత్తిందని తెలిపారు. మొత్తం 20 పత్రాలు వచ్చాయని, అందులో నాలుగు సంతకాల సంబంధిత కారణాలతో తిరస్కరణకు గురైనట్లు మధుసుదన్‌ వెల్లడించారు.

మరిన్ని వార్తలు