అన్నీ ఓకే కానీ, ఆ విషయంలో బ్రిటిషర్లకు ఇబ్బందులు.. అప్పుడే వచ్చిందో ఆలోచన!

19 Jan, 2022 11:01 IST|Sakshi

Britishers Uncomfortable In India: ఇప్పుడంటే మనకు సీలింగ్‌ ఫ్యాన్లు ఉన్నాయి. కానీ కరెంటు సౌకర్యం లేని వంద, రెండు వందల ఏళ్ల కింద పరిస్థితి ఏమిటో తెలుసా? బ్రిటిషర్లు ఉక్కపోత తట్టుకోవడానికి 
ఏం చేశారో తెలుసా..? గదిలో పైనుంచే వేలాడే వింజామర్లాంటి పంకాలను తయారు చేయించారు. ఆ విశేషాలు ఏమిటో తెలుసుకుందామా? 
– సాక్షి సెంట్రల్‌ డెస్క్‌  

బ్రిటిషర్లు ఇండియాకు వచ్చిన కొత్తలో ఇక్కడి చాలా పరిస్థితులకు తగ్గట్టుగా సర్దుకుపోగలిగారు. కానీ వారికి వచ్చిన చిక్కల్లా ఒక్కటే. మన ఎండాకాలం. బ్రిటిష్‌వారికి బాగా ఎండకొట్టడమంటే.. మనకు చలికాలంలో మధ్యాహ్నం ఉన్నట్టు ఉంటుందంతే. కానీ ఇక్కడి ఎండాకాలంలో ఎండ వేడిని తట్టుకోవడానికి వారు నానా తంటాలూ పడ్డారు. కరెంటు లేకపోవడంతో ఫ్యాన్లు వాడలేరు. ఈ క్రమంలోనే భారీ ‘మ్యాన్యువల్‌ పంకా’లపై దృష్టిపెట్టారు. 
(చదవండి: సర్పంచ్‌ పదవికి వేలం పాట.. ఓర్ని! అన్ని లక్షలేందిరా సామీ..)

వింజామరల నుంచి స్ఫూర్తి పొంది.. 
బ్రిటిష్‌ వాళ్లు వచ్చేప్పటికి మన దేశంలో రాజుల పాలన నడుస్తోంది. ఆ సమయంలో రాజులు, వారి కుటుంబ సభ్యులు, ఉన్నత స్థానాల్లో ఉండే పాలకులకు సేవకులు ‘వింజామర’లతో గాలి ఊపేవారు. వింజామరలు అంటే.. వస్త్రం, పక్షుల ఈకల వంటి వాటితో తయారై, పెద్దసైజు విసనకర్రల్లా ఉంటాయి. ఇక్కడి ఎండను, వేడిని తట్టుకోలేని బ్రిటిషర్లు.. ఆ వింజామరలను చూసి.. వాటి తరహాలో ‘పంకా’లను తయారు చేయించి వాడటం మొదలుపెట్టారు. 

గది నిండా గాలి వచ్చేలా.. 
నిజానికి ఒకరిద్దరికి అయితే వింజామరలు సరిపోతాయి. కానీ ఓ పెద్ద గది నిండా ఉండే వారికి గాలి రావాలంటే ఎలా? ఈ ఆలోచనతోనే పెద్ద పంకాలను తయారు చేయించేవారు.  

► గది వెడల్పు కన్నా కాస్త తక్కువ పొడవున్న ఓ దూలాన్ని లేదా గట్టి వెదురు బొంగును తెచ్చి.. దానికి రెండు, మూడు అడుగుల మేర ఎత్తు వచ్చేలా అడ్డంగా వస్త్రాన్ని అమర్చేవారు. దీనిని గది మధ్యలో పైకప్పు నుంచి వేలాడదీసేవారు. ఆ దూలానికి తాళ్లు కట్టి.. ఏదో ఓ వైపు గోడలో ఏర్పాటు చేసిన ప్రత్యేక రంధ్రాల ద్వారా బయటికి వేసేవారు. బయట కొందరు కూలీలు/బానిసలను పెట్టి ఆ తాడును లాగుతూ, వదులుతూ ఉండేలా చూసేవారు. ఇవే పంకాలు! 
కూలీలు/బానిసలు తాడును లాగుతూ, వదులుతూ ఉన్న కొద్దీ (పిల్లలు పడుకున్న ఊయలను తాడుతో ఊపినట్టుగా..).. గదిలో పైన ఏర్పాటుచేసిన ‘పంకా’లు.. అటూ ఇటూ ఊగుతూ గదిలో గాలి వీచేది. ఇలా పంకాలు ఊపే కూలీలను ప్రత్యేకంగా ‘పంకా వాలా’లు అని పిలిచేవారు. 

► అప్పట్లో బ్రిటిషర్లు మాత్రమేకాదు.. స్థానిక రాజులు, అధికారులు, ధనికులు తమ ఇళ్లు, ఆఫీసుల్లో కూడా ఇలాంటి ‘పంకా’లను ఏర్పాటు చేయించుకుని.. కూలీలు/బానిసలతో వినియోగించుకునేవారు.  

ఇంటి నిండా పంకాలే.. 
బాగా డబ్బున్నవారు, వ్యాపారులు, బ్రిటిషర్లలో కాస్త పైస్థాయి ఆఫీసర్ల నివాసాల్లో అయితే.. ఏకంగా హాలు, బెడ్‌రూంతో పాటు బాత్రూమ్‌లలోనూ పంకాలు ఏర్పాటు చేసుకునేవారు. ఒక్కోచోట నుంచి ఒక్కో తాడు ఇంటి బయటికి అమర్చేవారు. బయట ఉన్న పంకావాలాలు వాటిని లాగుతూ, వదులుతూ ఊపేవారు. 19వ శతాబ్దం మొదలయ్యాక.. విద్యుత్‌ అందుబాటులోకి రావడంతో ఈ ‘పంకా’లు అంతర్థానమైపోయాయి. 
(చదవండి: కీలక విషయాలు వెల్లడి.. రాష్ట్రాల కోవిడ్‌ మృతుల సంఖ్యలో భారీ తేడా?)

మరిన్ని వార్తలు