‘కళ్లల్లో నీళ్లు తిరిగాయి’.. పంజాబ్‌ సీఎంపై కేజ్రీవాల్ ప్రశంసలు

24 May, 2022 20:46 IST|Sakshi

చండీగఢ్‌: పంజాబ్‌ ముఖ్యమంత్రి భగవంత్‌మాన్‌పై ఆప్‌ జాతీయ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రశంసలు కురిపించారు. అవినీతి ఆరోపణలపై ఆరోగ్యశాఖ మంత్రిని కేబినెట్‌ నుంచి తొలగించిన కొద్దిసేపటికే అరవింద్‌ కేజ్రీవాల్‌ ట్విటర్‌ ద్వారా స్పందించారు. సీఎం భ‌గ‌వంత్ మాన్‌ను చూసి గ‌ర్వ‌ప‌డుతున్నాన‌ని అన్నారు. సీఎం భగవంత్‌ మాన్‌ చర్య తన కళ్లల్లో నీళ్లు తెప్పించిందని, దేశంలో నిజాయితీ పాలనను అందించే పార్టీ ఒక్క ఆమ్‌ ఆద్మీనేనని, ఆప్‌ను చూసి పంజాబ్‌తో సహా దేశమంతా గర్విస్తోందని అన్నారు.

భగవంత్‌ మాన్‌ నిర్ణయానికి చాలా ధైర్యం కావాలని, దేశంలో రాజకీయాలు తిరోగమనం చెందుతున్న వేళ ఆమ్‌ ఆత్మీ పార్టీ కొత్త ప్రారంభాన్ని తీసుకొచ్చిందన్నారు. సీఎం భ‌గ‌వంత్ మాన్ త‌లుచుకుంటే ఆరోగ్య మంత్రి చేసిన అవినీతిని క‌ప్పిపుచ్చ‌గ‌ల‌ర‌ని, కానీ అలా చేయ‌కుండా మంత్రిపై చ‌ర్య‌లు తీసుకున్నారని పేర్కొన్నారు. తను కూడా ఢిల్లీలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత ఓ మంత్రిని తొలగించినట్లు కేజ్రీవాల్‌ గుర్తు చేశారు.
సంబంధిత వార్త: అవినీతి ఆరోపణలు.. పంజాబ్‌ సీఎం సంచలన నిర్ణయం.. మంత్రి అరెస్ట్‌

కాగా పంజాబ్‌ ఆరోగ్యశాఖ మంత్రి విజయ్‌ సింఘ్లాను మంత్రివర్గం నుంచి తొలగిస్తూ ముఖ్యమంత్రి భగవంత్‌మాన్‌ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. మంత్రి విజయ్‌ సింగ్లాపై అవినీతి ఆరోపణలు రావడంతో పదవి నుంచి బర్తరఫ్‌ చేస్తున్నట్లు పేర్కొన్నారు. టెండర్ల కోసం సింగ్లా ఒక శాతం కమీషన్‌ డిమాండ్‌ చేసినట్లు ఆరోపణలు రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీఎం తెలిపారు. పదవి నుంచి తొలగించిన వెంటనే ఏసీబీ అధికారులు మంత్రిని అరెస్ట్‌ చేశారు.

మరిన్ని వార్తలు