మళ్లీ ఈడీ ముందుకు కవిత .. మరోసారి విచారించనున్న అధికారులు

16 Mar, 2023 01:44 IST|Sakshi

ఢిల్లీ లిక్కర్‌ కేసులో మరోసారి విచారించనున్న అధికారులు 

సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్‌ కుంభకోణం కేసులో గురువారం బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు మరోసారి విచారించనున్నారు. ఈ నెల 11న సుమారు 9 గంటల పాటు కవితను ప్రశ్నించిన ఈడీ.. 16వ తేదీన మళ్లీ హాజరుకావాలని నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.

ఈ మేరకు గురువారం ఉదయం 11 గంటలకు కవిత ఈడీ కా ర్యాలయానికి వెళ్లనున్నారు. లిక్కర్‌ పాలసీ రూపకల్పన, సౌత్‌గ్రూపు పాత్ర, ఆప్‌ నేతలకు ముడుపులు తదితర అంశాలపై ప్రశ్నించడంతోపాటు బుచ్చిబాబు, అరుణ్‌పిళ్లైతో కలిపి విచారించాలని ఈడీ అధికారులు నిర్ణయించినట్టు తెలిసింది. 

అరుణ్‌ పిళ్లైతో కలిపి బుచ్చిబాబు విచారణ 
ఈ కేసులో హైదరాబాద్‌కు చెందిన ఆడిటర్‌ బుచ్చిబాబును ఈడీ అధికారులు బుధవారం విచారించారు. ఆయనను ఒంటరిగా, అరుణ్‌ పిళ్లైతో కలిపి ప్రశ్నించినట్టు తెలిసింది. కేసులో ఇప్పటివరకు సేకరించిన ఆధారాలు, సీసీ టీవీ ఫుటేజీల ఆధారంగా ఇద్దరినీ విచారించారని.. సాక్ష్యాల ధ్వంసం, మద్యం విధాన రూపకల్పన, హోటళ్లలో భేటీ వంటి అంశాలపై లోతుగా ప్రశ్నించారని సమాచారం.  

ఢిల్లీకి మంత్రులు, ఎమ్మెల్యేలు 
సాక్షి హైదరాబాద్‌: ఢిల్లీ లిక్కర్‌ పాలసీ స్కాంలో ఆరోపణలపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈడీ విచారణకు హాజరవుతున్న నేపథ్యంలో ఆమెకు నైతిక మద్దతు అందించేందుకు మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, ఎర్రబెల్లి, శ్రీనివాస్‌గౌడ్, సత్యవతి రాథోడ్‌తోపాటు భారీ సంఖ్యలో ఎమ్మెల్యేలు బుధవారం రాత్రి ఢిల్లీకి చేరుకున్నారు.

ఢిల్లీలో న్యాయ నిపుణులతో చర్చించడంతోపాటు అక్కడి పరిణామాలను మంత్రులు ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వివరించనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

మరిన్ని వార్తలు