లిక్కర్‌ స్కాం ఈడీ నోటీసుల వ్యవహారం.. సుప్రీంలో కవితకు ఊరట

26 Sep, 2023 14:18 IST|Sakshi

సాక్షి, ఢిల్లీ: బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల  కవితకు లిక్కర్‌ స్కామ్‌ ఈడీ సమన్ల వ్యవహారంలో సుప్రీం కోర్టులో ఊరట లభించింది. కవిత పిటిషన్‌పై విచారణను నవంబర్‌ 20వ తేదీకి వాయిదా వేసింది సర్వోన్నత న్యాయస్థానం. దీంతో.. ఈలోపు ఆమెకు ఎలాంటి నోటీసులు జారీ చేయొద్దని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌EDని ఆదేశించింది. 

మహిళ అయినంత మాత్రాన విచారణ వద్దనలేమని జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ ధర్మాసనం వ్యాఖ్యానించింది. అయితే.. మహిళలకు కొన్ని రక్షణలు కల్పించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే ఆమెకు తాత్కాలిక ఊరట ఇచ్చింది.  దీంతో సుప్రీం చెప్పేంత వరకు కవితకు నోటీసులు జారీ చేయమని ఈడీ, బెంచ్‌కు తెలిపింది.

ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ ఆమెకు తమ ఎదుట విచారణకు హాజరు కావాలని మరోసారి నోటీసులు పంపిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలో.. ఈడీ ఇచ్చిన సమన్లు రద్దు చేయాలని సుప్రీంను ఆశ్రయించారామె. లిక్కర్‌ కేసులో గతంలోనూ ఈడీ నోటీసులు అందుకున్న కవిత.. ఈడీ కార్యాలయంలో విచారణకు హారజయ్యారు. అయితే.. ఈడీ కార్యాలయంలో మహిళల విచారణ సీఆర్సీసీకి విరుద్ధం అంటూ ఆమె మొదటి నుంచి వాదిస్తున్నారు. నళిని చిదంబరం తరహాలో ఇంటివద్దే తనను విచారణ జరపాలని ఆమె కోరుతున్నారు. ఈ క్రమంలో దర్యాప్తు సంస్థల తీరును తప్పుబడుతూ ఆమె సుప్రీంలో పిటిషన్‌ వేశారు. 

అయినప్పటికీ ఈడీ మరోసారి నోటీసులు జారీ చేసింది. తన పిటిషన్‌ విచారణలో ఉండగా.. నోటీసులు ఎలా జారీ చేస్తారని ఈడీ తీరును ప్రశ్నించారామె. అంతేకాదు తాను విచారణకు రాలేనని కరాకండిగా చెబుతూ వచ్చారు. కవిత బిజీగా ఉంటే నోటీసుల విషయంలో పది రోజుల సమయం పొడగిస్తామని గత విచారణలో ఈడీ కోర్టుకు తెలిపింది. ఈ క్రమంలో నేటితో పదిరోజుల గడువు ముగిసింది. ఇవాళ్టి విచారణ సందర్భంగా.. కవిత పిటిషన్‌పై విచారణ కొనసాగుతున్నందున తదుపరి విచారణలోపు ఎలాంటి నోటీసులు జారీ చేయొద్దని సుప్రీం కోర్టు, ఈడీకి స్పష్టం చేసింది.  

మరిన్ని వార్తలు