సైన్స్‌ అండ్‌ టెక్నాలజీకి 20 శాతం అధికం

2 Feb, 2021 08:05 IST|Sakshi

2021-22 బడ్జెట్‌లో రూ.14,793 కోట్లు

రూ. 4,000 కోట్లతో ‘డీప్‌ ఓషన్‌ మిషన్‌’ 

న్యూఢిల్లీ: శాస్త్ర, సాంకేతిక శాఖకు కేంద్ర ప్రభుత్వం 2021–22 బడ్జెట్‌లో రూ.14,793.66 కోట్లు కేటాయించింది. 2020–21 బడ్జెట్‌ కేటాయింపులతో పోలిస్తే ఇది 20% అధికం కావడం విశేషం. అలా గే ఎర్త్‌ సైన్సెస్‌ శాఖకు ప్రత్యేకంగా రూ.1,897.13 కోట్లు కేటాయించారు. కేంద్ర సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ శాఖ పరిధిలో డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ (డీఎస్‌టీ), డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ బయోటెక్నాలజీ (డీబీటీ), డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ సైంటిఫిక్‌ అండ్‌ ఇండస్ట్రియల్‌ రీసెర్చ్‌ (డీఎస్‌ఐఆర్‌) ఉన్నాయి. దే శంలో కరోనా వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేయడంలో ఈ విభాగాలన్నీ కీలకంగా పనిచేశాయి. 2021–22 బడ్జెట్‌లో డీఎస్‌టీకి రూ.6,067.39 కోట్లు, డీబీటీకి రూ.3,502.37 కోట్లు, డీఎస్‌ఐఆర్‌కు రూ.5,224.27 కోట్లు కేటాయించారు. 2020–21 బడ్జెట్‌లో సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ శాఖకు రూ.14,473.66 కోట్లు కేటాయించగా, తర్వాత దాన్ని రూ.11,551.86 కోట్లుగా సవరించారు.  ఇండియాలో ‘డీప్‌ ఓషన్‌ మిషన్‌’ను ప్రారంభిస్తామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తన బడ్జెట్‌ ప్రసంగంలో చెప్పారు. ఇందుకోసం ఐదేళ్లలో రూ.4,000 కోట్లు ఖర్చు చేస్తామన్నారు. సముద్రాలపై అధ్యయనం, సర్వే, సముద్రాల్లోని జీవవైవిధ్యాన్ని పరిరక్షించడమే ఈ ప్రాజెక్టు ఉద్దేశమని వెల్లడించారు.  

సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ శాఖకు బడ్జెట్‌ కేటాయింపులు    

2021-22     రూ.14,793.66  
2020-21     రూ.11,551.86

  

అంతరిక్ష విభాగానికి రూ.13,949  కోట్లు
 అంతరిక్ష విభాగానికి కేంద్రం రూ.13,949 కోట్లు కేటాయించింది. ఇది గతేడాది గతేడాది రూ.8,228 కోట్లు కేటాయించగా, ఈసారి రూ.4,449 కోట్లు ఎక్కువ కేటాయించడం గమనార్హం. ఈ మొత్తంలో రూ.700 కోట్లను కొత్తగా ఏర్పడిన ప్రభుత్వ రంగ సంస్థ ‘న్యూ స్పేస్‌ ఇండియా లిమిటెడ్‌’కు కేటాయించారు. గగన్‌యాన్‌ ప్రాజెక్టు ద్వారా నలుగురు మానవులను అంతరిక్షంలోకి పంపడానికి రష్యాలోని జెనెరిక్‌ స్పేస్‌ ఫ్లయిట్‌ ఆస్పెక్ట్‌లో శిక్షణ ఇస్తున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు. డిసెంబర్‌ 2021లో మానవరహిత అంతరిక్ష నౌకను పరీక్షిస్తామని వెల్లడించారు.  

హోం శాఖకు రూ.1,66,547 కోట్లు
 కేంద్ర హోంశాఖకు 2021–22 బడ్జెట్‌లో రూ. 1,66,547 కోట్లు కేటాయిస్తున్నట్లు ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంతో పోల్చితే ఇది 11.48 శాతం అధికం. ఇందులో మెజారిటీ నిధులు కేంద్ర సాయుధ బలగాల నిర్వహణకు, జనగణనకు సంబంధించిన కార్యకలాపాలకు వినియోగించనున్నారు. 2020–21 ఆర్థిక సంవత్సరంలో హోం శాఖకు రూ.1,49,387 కోట్లు కేటాయించగా ప్రస్తుతం ఆ మొత్తాన్ని రూ.1,66,547 కోట్లకు పెంచారు. ఇం దులో కేంద్ర సాయుధ పోలీస్‌ బలగాలైన సీఆర్‌పీఎఫ్, బీఎస్‌ఎఫ్, సీఐఎస్‌ఎఫ్‌లకు రూ.1,03,802.52 కోట్లు, జనాభా లెక్కలకు రూ.3,768.28 కోట్లు కేటాయించారు.

మరిన్ని వార్తలు