బడ్జెట్‌ 2021: మౌలిక సదుపాయాలకు భారీగా..!

1 Feb, 2021 12:17 IST|Sakshi

పశ్చిమబెంగాల్‌, తమిళనాడుపై ప్రత్యేక దృష్టి

రైల్వేల అభివృద్ధికి లక్ష కోట్ల రూపాయలు కేటాయింపు

మెట్రోకి భారీగా నిధులు

సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా మౌలిక సదుపాయాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని నిర్మలా సీతారామన్ తెలిపారు. రోడ్లు, రైల్వేలు, విమాన రంగంపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. పెట్టుబడుదారులకు మరిన్ని మౌలిక వసతుల ఏర్పాటుకు కృషి చేస్తామని తెలిపారు. ఎయిర్‌పోర్టుల్లో ఉన్న ప్రభుత్వ వాటాను విక్రయిస్తామన్నారు. ఇక ఈ ఏడాది బడ్జెట్లో అయిదు ప్రత్యేక జాతీయ రహదారుల అభివృద్ధికి 5వేల కోట్ల రూపాయలు కేటాయించారు. కేరళలో 11వేల కి.మీ. జాతీయ రహదారుల కారిడార్‌ నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. ఇక త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోయే రాష్ట్రాలపై బడ్జెట్‌లో ప్రత్యేక దృష్టి పెట్టారు. దానిలో భాగంగా పశ్చిమ బెంగాల్‌లో 25 వేల కోట్ల రూపాయలతో రహదారుల నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. తమిళనాడులో రహదారలు అభివృద్ధికి లక్ష కోట్ల రూపాయలు కేటాయించారు. అస్సాంలో రహదారుల అభివృద్ధికి 19వేల కోట్ల రూపాయలు కేటాయించారు. కోల్‌కతా-సిలిగురి రహదారి విస్తరణ చేపట్టనున్నట్లు తెలిపారు. 

మెట్రోకి భారీగా నిధులు
ఇక బడ్జెట్‌లో మెట్రోలైట్‌, మైట్రో న్యూ పేరుతో కొత్త ప్రాజెక్ట్‌లు ప్రతిపాదించారు నిర్మలా సీతారామన్‌. బెంగళూరు, నాగ్‌పూర్‌, కొచ్చి మెట్రోరైలు అభివృద్ధికి భారీగా నిధులు కేటాయించారు. చెన్నై మెట్రోకు 63వేల కోట్ల రూపాయలు కేటాయించగా.. బెంగళూరు మెట్రోరైలు అభివృద్ధికి 14,788 కోట్ల రూపాయలు, కొచ్చి మెట్రోరైలు ఫేజ్‌-2 అభివృద్ధికి 1957 కోట్ల రూపాయలు.. బస్‌ ట్రాన్స్‌పోర్ట్‌ సర్వీసుల అభివృద్ధికి రూ.18వేల కోట్లు కేటాయించారు. ఇక దేశంలో లక్షా 18వేల కిలోమీటర్ల మేర రైల్వే లైన్ల అభివృద్ధి చేయనున్నట్లు ప్రకటించారు. ఇందుకు గాను 1,01,000 కోట్ల రూపాయలు కేటాయించారు. 

ఖరగ్‌పూర్‌-విజయవాడ మధ్య ఈస్ట్‌-కోస్ట్‌ సరకు రవాణా కారిడార్‌
2022 జూన్‌ నాటికి తూర్పు, పశ్చిమ ప్రత్యేక సరకు రవాణా కారిడార్లు అందులోకి తెస్తామన్నారు. ఇందులో భాగంగా ఖరగ్‌పూర్‌-విజయవాడ మధ్య ఈస్ట్‌-కోస్ట్‌ సరకు రవాణా కారిడార్‌ ఏర్పాటు చేస్తామన్నారు. 2023 నాటికి 100 శాతం బ్రాడ్ గేజ్ విద్యుదీకరణ పూర్తి చేస్తామన్నారు. 2 వేల కోట్లకు మించిన విలువతో 7 కొత్త నౌకాశ్రయాలు ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. 2021-22లో పవన్‌ హన్స్‌, ఎయిరిండియా ప్రైవేటీకరణ చేయనున్నాట్లు నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు.

మరిన్ని వార్తలు