బడ్జెట్‌ 2021: ఈ విషయాలు మీకు తెలుసా!

2 Feb, 2021 08:22 IST|Sakshi

న్యూఢిల్లీ : బడ్జెట్‌ రోజున ఆర్థ్ధిక మంత్రి పార్లమెంట్‌లో అడుగుపెట్టడానికి ముందు ఒక లెదర్‌ బ్రీఫ్‌కేస్‌ పట్టుకుని ప్రెస్‌ ముందుకు వచ్చి ఫొటోలు దిగడం ఒక ఆనవాయితీ. దానికి ఓ కారణం లేకపోలేదు. అదేమిటంటే.. 1869లో బ్రిటిష్‌ కామన్స్‌ సభలో బడ్జెట్‌ ప్రవేశపెట్టడానికి వచ్చిన జార్జి వార్డ్‌ హంట్‌కు సభాధ్యక్షుడి నుంచి అనుమతి రాగానే లేచి తనతో తెచ్చుకున్న బాక్స్‌ను తెరిచి చూసి ఒక్కసారే అవాక్కయ్యాడు. బడ్జెట్‌ ప్రసంగం ఉన్న పేపర్లను ఇంట్లోనే మర్చిపోయినట్లు గ్రహించాడు. అప్పటికేదో మేనేజ్‌ చేశాడు. అయితే అప్పటినుంచి మాత్రం ప్రతి ఏటా బడ్జెట్‌ ప్రవేశపెట్టడానికి సభకు వచ్చేముందు తనవెంట పత్రాలన్నీ తెచ్చుకున్నానని, ఇంట్లో ఏవీ మర్చిపోలేదని పార్లమెంట్‌ వద్ద గుమికూడిన జనానికి తెలియజేస్తూ బాక్స్‌ను చూపించి లోపలికి వెళ్లడం మొదలు పెట్టారు. అదే ఓ సంప్రదాయంగా మారింది. దాంతో మన దగ్గరా దాన్నే ఫాలో అయిపోతున్నారు. చదవండి: ఎన్నికలు: ఆ రాష్ట్రాలకు వరాలపై జల్లు 

బ్రిటిష్‌ వారు పాలించేటప్పుడు మనదేశ బడ్జెట్‌ను సాయంత్రం 5 గంటలకు ప్రవేశ పెట్టేవారు. ఎందుకంటే.. మన దేశ కాలమానానికి బ్రిటిష్‌ కాలమానానికి ఐదున్నర గంటల తేడా ఉంటుంది. ఇక్కడ బడ్జెట్‌ ప్రవేశపెట్టి ఆ వివరాలను మరునాడు ఉదయాన్నే బ్రిటన్‌కు చేరవేయడానికి వీలుగా వారు ఈ సమయాన్ని ఎంచుకున్నారు. అయితే, స్వాతంత్య్రం వచ్చాక కూడా 1999–2000 సంవత్సరం బడ్జెట్‌కు ముందువరకు మనం కూడా సంప్రదాయాన్ని కొనసాగించాం..   

 ఏ ఆర్థిక సంవత్సరమైనా
► ఏప్రిల్‌ 1న ప్రారంభమై మార్చి చివర్లోనే ఎందుకు ముగుస్తుంది? పూర్వం ఆర్థిక సంవత్సరం జూలై 1 నుంచి జూన్‌ నెలాఖరు వరకు ఉండేది. కొన్నాళ్లు జనవరి నుంచి డిసెంబరు వరకు కూడా ఉండేది.

► స్వాతంత్య్రానంతరం ఆర్థిక సంవత్సరంగా దేన్ని నిర్ణయించాలన్న అంశంపై కమిటీ కూడా వేశారు. చాలా దేశాల్లో ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌ నుంచే మొదలవుతుంది. దాంతో మనం కూడా ఇదే ఆర్థికసంవత్సరాన్ని కొనసాగించడం వల్ల ఇబ్బందులేవీ తలెత్తకపోవడంతో అప్పట్నుంచి దీన్నే అనుసరిస్తున్నాం.   

► 1950–51 బడ్జెట్‌కు చాలా ప్రాధాన్యముంది. ఎందుకంటే ఈ బడ్జెట్‌లోనే తొలిసారిగా మిగులు సాధించారు. ఏ విధమైన పన్నులూ పెంచలేదు. ఆర్థికవ్యవస్థపై శ్వేతపత్రాన్ని తొలిసారి విడుదల చేశారు.

మరిన్ని వార్తలు