అన్ని వర్గాలకు సంతృప్తికరంగా బడ్జెట్‌: మోదీ

1 Feb, 2021 16:19 IST|Sakshi

న్యూఢిల్లీ: బడ్జెట్‌లో మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేశామని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. కొత్త అవకాశాలు కల్పించేలా బడ్జెట్-2021 రూపకల్పన జరిగిందని, అన్ని వర్గాలను సంతృప్తి పరిచేలా ఉందని పేర్కొన్నారు. పారదర్శకతతో కూడిన బడ్జెట్‌ను ప్రవేశపెట్టామని హర్షం వ్యక్తం చేశారు. కాగా విపక్షాల ఆందోళనల నడుమ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ వరుసగా మూడోసారి కేంద్ర ఆర్థిక బడ్జెట్‌ను సోమవారం పార్లమెంటులో ప్రవేశపెట్టారు. కరోనా లాక్‌డౌన్‌ కారణంగా ఎదురైన విపత్కర పరిస్థితుల నేపథ్యంలో దేశ ఆర్థిక వ్యవస్థకు ఈ బడ్జెట్‌ కొత్త ఊతం ఇస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. (చదవండి: బడ్జెట్‌ 2021: ధరలు పెరిగేవి.. తగ్గేవి ఇవే!)

ఈ అంశంపై స్పందించిన ప్రధాని మోదీ.. ‘‘ఇంతకు ముందెన్నడూ లేని అసాధారణ పరిస్థితులలో కేంద్ర బడ్జెట్‌ 2021 ప్రవేశపెట్టబడింది. తద్వారా భారత్‌ ఎంతటి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగగలదో మరోసారి ప్రపంచానికి చాటిచెప్పింది. అన్ని వర్గాలకు మేలు చేకూర్చే విధంగా బడ్జెట్‌ను రూపొందించాం. రైతుల ఆదాయాన్ని పెంచే అంశాలపై దృష్టి సారించాం. ఇకపై అన్నదాతలు సులభంగా రుణాలు పొందగలుగుతారు. వ్యవసాయ మౌలిక సదుపాయాల కల్పన నిధి(అగ్రికల్చర్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఫండ్‌) సాయంతో ఏపీఎంసీ మార్కెట్లను బలోపేతం చేసేందుకు బాటలు పడ్డాయి. సామాన్యుడిపై పన్ను భారం వేస్తామని అందరూ భావించారు. కానీ అలాంటివేమీ లేకుండా పూర్తి పారదర్శకంగా ఈ బడ్జెట్‌ ఉంది. యువతకు ఉపాధి కల్పన, సరికొత్త అవకాశాలు కల్పించేలా చర్యలు తీసుకున్నాం’’ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు