President Droupadi Murmu: బలమైన దేశంగా ఎదిగాం!

1 Feb, 2024 02:03 IST|Sakshi
రాష్ట్రపతి ప్రసంగాన్ని శ్రద్ధగా ఆలకిస్తున్న సభ్యులు; ప్రసంగిస్తున్న రాష్ట్రపతి ముర్ము

బాలరాముడి ప్రాణప్రతిష్ట, ఆర్థిక సంస్కరణల్లో కీర్తిప్రతిష్ట 

పార్లమెంట్‌లో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఉద్ఘాటన 

ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగం 

మోదీ సర్కారు సాధించిన ఘనతల ప్రస్తావన  

భవిష్యత్తు తరాల కోసం ఘనమైన వారసత్వాన్ని నిర్మించాలని పిలుపు 

యువశక్తి, మహిళా శక్తి, రైతులు, పేదలు.. వికసిత్‌ భారత్‌కు నాలుగు మూలస్తంభాలు

న్యూఢిల్లీ: అయోధ్యలో రామమందిర నిర్మాణం అనే శతాబ్దాల కల ఎట్టకేలకు నెరవేరిందని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము హర్షం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ కృషితో బలమైన దేశంగా ఎదిగామని చెప్పారు. బాలరాముడి ప్రాణప్రతిష్ట నిర్వహించుకున్నామని, మరోవైపు ఆర్థిక సంస్కరణల్లో కీర్తిప్రతిష్టలు సాధించామని వ్యాఖ్యానించారు. పార్లమెంట్‌ సమావేశాలు బుధవారం నూతన భవనంలో ప్రారంభమయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ముర్ము దాదాపు 75 నిమిషాలపాటు ప్రసంగించారు. పార్లమెంట్‌ కొత్త భవనంలో ఆమె ప్రసంగించడం ఇదే మొదటిసారి. గత పదేళ్లలో మోదీ ప్రభుత్వం సాధించిన ఘనతలను ప్రస్తావించారు.

ఉగ్రవాదం, విస్తరణవాదానికి మన సైనిక దళాలు తగిన సమాధానం చెబుతున్నారని ప్రశంసించారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆర్థిక సంస్కరణలతో మన దేశం ప్రపంచంలో మొదటి ఐదు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా అవతరించిందని గుర్తుచేశారు. భారత్‌ బలమైన దేశంగా మారిందన్నారు. ప్రతిష్టాత్మక జి–20 సదస్సును కేంద్రం విజయవంతంగా నిర్వహించిందని, తద్వారా ప్రపంచంలో ఇండియా  స్థానం మరింత బలోపేతమైందని వివరించారు. జమ్మూకశీ్మర్‌తోపాటు ఈశాన్య రాష్ట్రాల్లోనూ మొదటిసారి అంతర్జాతీయ సమావేశాలు జరిగినట్లు తెలియజేశారు. పార్లమెంట్‌లో రాష్ట్రపతి ముర్ము ఇంకా ఏం మాట్లాడారంటే..  

జనవరి 22 చిరస్మరణీయమైన రోజు  
‘‘రాబోయే శతాబ్దాలకు సంబంధించి దేశ భవిష్యత్తు స్క్రిప్‌్టను రాసుకోవాల్సిన సమయం వచ్చింది. మన పూరీ్వకులు వేలాది సంవత్సరాల గొప్ప వారసత్వాన్ని మనకు వరంగా అందించారు. ప్రాచీన భారతదేశంలో అప్పటి మనుషులు సాధించిన విజయాలను ఇప్పటికీ సగర్వంగా గుర్తుచేసుకుంటున్నాం. రాబోయే కొన్ని శతాబ్దాలపాటు గుర్తుంచుకొనే ఘనమైన వారసత్వాన్ని ఇప్పటి తరం మనుషులు నిర్మించాలి. దేశ ప్రయోజనాల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం గత పదేళ్లలో ఎన్నో ఘనతలు సాధించింది. దశాబ్దాల, శతాబ్దాల ఆకాంక్షలను నెరవేర్చింది. అయోధ్యలో రామమందిర నిర్మాణం కోసం ప్రజలు శతాబ్దాలపాటు ఎదురుచూశారు. అది ఇప్పుడు నెరవేరింది. ఆలయం ప్రారంభమైన తర్వాత కేవలం ఐదు రోజుల్లో 13 లక్షల మంది దర్శించుకున్నారు. బాలరాముడి ప్రాణప్రతిష్ట జరిగిన జనవరి 22వ తేదీ నిజంగా చిరస్మరణీయమైన రోజు.  

నక్సల్స్‌ హింసాకాండ తగ్గుముఖం  
ఆర్టికల్‌ 370 రద్దుపై గతంలో ఎన్నో అనుమానాలు ఉండేవి. ఇప్పుడు ఆర్టికల్‌ 370 అనేది చరిత్రలో కలిసిపోయింది. ట్రిపుల్‌ తలాఖ్‌కు వ్యతిరేకంగా ప్రభుత్వం కఠిన చట్టాన్ని తీసుకొచి్చంది. సవాళ్లను సమర్థంగా ఎదుర్కొంటూ భవిష్యత్తు నిర్మాణం కోసం మన శక్తిని గరిష్ట స్థాయిలో ఖర్చు చేసినప్పుడే దేశం ప్రగతి పథంలో వేగంగా ముందంజ వేస్తుంది. ప్రభుత్వం దేశ సరిహద్దుల్లో ఆధునిక మౌలిక సదుపాయాలు కలి్పస్తోంది. సైనిక దళాలను బలోపేతం చేస్తోంది. అంతర్గత భద్రతకు సంబంధించిన ప్రభుత్వ ప్రయత్నాలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. జమ్మూకశీ్మర్‌లో మార్కెట్లు, వీధులు గతంలో నిర్మానుష్యంగా కనిపించేవి. ఇప్పుడు జనంతో అవి కిక్కిరిసిపోతున్నాయి. జమ్మూకశ్మీర్‌లో శాంతి భద్రతలు మెరుగుపడ్డాయి. ప్రజలు స్వేచ్ఛగా జీవిస్తున్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో వేర్పాటువాద ఘటనలు గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. శాంతియుత పరిస్థితులు కనిపిస్తున్నాయి. దేశంలో నక్సల్స్‌ ప్రభావిత ప్రాంతాల సంఖ్య కూడా తగ్గిపోయింది. నక్సలైట్ల హింసాకాండ భారీగా తగ్గింది.  

అదుపులోనే ద్రవ్యోల్బణం  
‘అభివృద్ధి చెందిన భారత్‌’ అనే మహాసౌధం నాలుగు మూల స్తంభాలపై స్థిరంగా ఉంటుందని ప్రభుత్వం నమ్ముతోంది. అవి యువశక్తి, మహిళా శక్తి, రైతులు, పేదలు. ఈ నాలుగు వర్గాలను బలోపేతం చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తోంది. ‘గరీబీ హఠావో’ నినాదాన్ని మనమంతా చిన్నప్పటి నుంచి వింటున్నాం. పేదరికాన్ని పారదోలడాన్ని మన జీవితాల్లో మొదటిసారి చూస్తున్నాం. ఇండియాలో గత పదేళ్లలో ఏకంగా 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని నీతి ఆయోగ్‌ ప్రకటించింది. దేశంలో రక్షణ ఉత్పత్తుల విలువ రూ.లక్ష కోట్ల మార్కును దాటడం హర్షణీయం. ‘మేక్‌ ఇన్‌ ఇండియా’, ‘ఆత్మనిర్భర్‌ భారత్‌’ కార్యక్రమాలు మన దేశ అభివృద్ధి ప్రయాణానికి బలాలుగా మారుతు న్నాయి. ప్రతికూల పరిస్థితులు, ఒత్తిళ్లు ఎదురైనప్పటికీ కేంద్ర ప్రభుత్వం దేశంలో ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచింది. ప్రజలపై అదనపు భారం పడకుండా జాగ్రత్తవహించింది’’.

మహిళలకు 15 వేల డ్రోన్లు   
‘2014 తర్వాత గత పదేళ్లుగా ద్రవ్యోల్బణ రేటు సగటున కేవలం 5 శాతం ఉంది. ప్రభుత్వ చర్యలతో ప్రజల చేతుల్లో డబ్బు ఆడుతోంది. సామాన్య ప్రజలు కూడా పొదుపు చేయగలగుతున్నారు. మహిళలకు చేయూత ఇవ్వడానికి ప్రభుత్వం ఎన్నో చర్యలు చేపట్టింది. బ్యాంకు రుణాలను అందుబాటులోకి తీసుకొచి్చంది. సైనిక దళాల్లో శాశ్వత మహిళా కమిషన్‌ను మంజూరు చేసింది. సైనిక స్కూళ్లతోపాటు నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీలోనూ మహిళలకు ప్రవేశం కల్పిస్తోంది. ఎయిర్‌ఫోర్స్, నావికాదళంలోనూ మహిళలను ఆఫీసర్లుగా నియమిస్తోంది. అలాగే 2 కోట్ల మంది అక్కాచెల్లెమ్మలను లక్షాధికారులను చేయాలని ప్రభుత్వం సంకలి్పంచింది. ‘నమో డ్రోన్‌ దీదీ’ పథకం కింద మహిళలకు 15 వేల డ్రోన్లు అందజేయాలని నిర్ణయించింది’.

మహిళల సారథ్యంలో దేశాభివృద్ధి  
‘మూడు దశాబ్దాల నిరీక్షణ తర్వాత నారీశక్తి వందన్‌ అధినియం(మహిళా రిజర్వేషన్‌ చట్టం) పార్లమెంట్‌లో ఆమోదం పొందింది. ఈ చట్టంతో చట్టసభల్లో మహిళల భాగస్వామ్యం పెరుగుతుంది. మహిళల సారథ్యంలో దేశాభివృద్ధి జరగాలన్నదే ప్రభుత్వ ఆశయం. ఈ చట్టాన్ని తీసుకొచి్చనందుకు పార్లమెంట్‌ సభ్యులకు నా అభినందనలు తెలియజేస్తున్నా. కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సంస్కరణలు దేశ ప్రగతి తోడ్పాడునందిస్తున్నాయి. ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో భారత్‌ కూడా ఒకటి. రెండు వరుస త్రైమాసికాల్లో వృద్ధి రేటు 7.5 శాతానికిపైగానే నమోదైంది. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు ప్రభుత్వం అండగా నిలుస్తోంది. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం అందిస్తోంది’.

25 వేల కిలోమీటర్లకు పైగా రైల్వే లైన్లు   
‘రైల్వేశాఖ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం గత పదేళ్ల కాలంలో వినూత్న చర్యలు చేపట్టింది. నమో భారత్, అమృత్‌ భారత్, వందే భారత్‌ రైళ్లను ప్రవేశపెట్టింది. కొత్తగా 25 వేల కిలోమీటర్లకుపైగా రైల్వే లైన్లు వేసింది. కొన్ని అభివృద్ధి చెందిన దేశాల్లో ఉన్న మొత్తం రైల్వేట్రాక్‌ పొడవు కంటే ఇదే ఎక్కువ. రైల్వేశాఖలో 100 శాతం విద్యుదీకరణకు చాలా దగ్గరలో ఉన్నాం. దేశంలో తొలిసారిగా సెమీ–హైస్పీడ్‌ రైళ్లు ప్రారంభమయ్యాయి. 39 మార్గాల్లో వందేభారత్‌ రైళ్లు నడుస్తున్నాయి. అమృత్‌ భారత్‌ స్టేషన్‌ పథకం కింద 1,300 రైల్వేస్టేషన్లను ప్రభుత్వం అభివృద్ధి చేసింది. ప్రతి ప్రయాణికుడికి రైల్వేశాఖ 50 శాతం డిస్కౌంట్‌ ఇస్తోంది. దీనివల్ల పేద, మధ్య తరగతి ప్రయాణికులకు ప్రతి ఏటా రూ.60 వేల కోట్ల సొమ్ము ఆదా అవుతోంది’.

whatsapp channel

మరిన్ని వార్తలు