బడ్జెట్‌: పెరిగిన కొలువులు! 

2 Feb, 2021 09:06 IST|Sakshi

న్యూఢిల్లీ: ఈ ఏడాది మార్చి 1 నాటికి వివిధ కేంద్ర ప్రభుత్వ విభాగాల్లోని మొత్తం కొలువుల సంఖ్య 34,14,226కు చేరనున్నట్లు సోమవారం బడ్జెట్‌లో వెల్లడించారు. మార్చి 1, 2019 నాటికి 32,71,113 కేంద్ర ఉద్యోగాలు ఉండగా, ఈ ఏడాది మార్చి 1 నాటికి 1,43,113 ఉద్యోగాలు పెరగనున్నట్లు పేర్కొన్నారు. వ్యవసాయం, సహకార, రైతు సంక్షేమం శాఖలో మార్చి 1, 2019 నాటికి 3,619 ఉద్యోగాలు ఉండగా ఈ రెండేళ్లలో 2,207 పెరిగి 5,826కు చేరనున్నాయి. అలాగే పౌరవిమానయానంలో 1,058 పెరిగి 1,254 నుంచి 2,312కు, రక్షణ శాఖలో 12,537 పెరిగి 80,463 నుంచి 93,000కు చేరనున్నాయి. అలాగే సాంస్కృతిక శాఖలో 3,638, ఎర్త్‌ సైన్సెస్‌లో 2,859, పర్యావరణం, అటవీ, వాతావరణ మార్పుల శాఖలో 2,263, విదేశీ వ్యవహారాల్లో 2,204, వాణిజ్యంలో 2,139, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీలో 1,452; ఆరోగ్య–కుటుంబ సంక్షేమంలో 4,072, కార్మిక–ఉపాధి కల్పనలో 2,419, జలవనరులు, నదుల అభివృద్ధి, గంగానది పునర్వవస్థీకరణలో 1,456 పెరగనున్నట్లు పేర్కొన్నారు. మిగిలిన విభాగాల్లోనూ ఇలాగే పెరిగినట్లు వివరించారు.
చదవండి: బడ్జెట్‌: ఈ విషయాలు మీకు తెలుసా! 
చదవండి: బడ్జెట్‌ 2021: రక్షణ రంగం కేటాయింపులు..

‘గిగ్‌’ కార్మికులకూ సామాజిక భద్రత 
న్యూఢిల్లీ: ఈ కామర్స్‌ వ్యాపార సంస్థల్లో పనిచేసే ‘గిగ్‌’ కార్మికులకూ సామాజిక భద్రతా ప్రయోజనాలను కల్పిస్తామని కేంద్రం సోమవారం తెలిపింది. కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన అనంతరం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ మాట్లాడుతూ.. గిగ్‌ వర్కర్స్, భవన నిర్మాణ కార్మికులతో పాటు ఇతరుల సమాచారం సేకరించేందుకు ఆన్‌లైన్‌ పోర్టల్‌ ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. గిగ్, ప్లాట్‌ఫాం కార్మికులతో సహా మొత్తం శ్రామికశక్తికి తొలిసారి సామాజిక భద్రతను కల్పించడానికి నిబంధనలు రూపొందించినట్లు ఆమె వెల్లడించారు. ఉబెర్, ఓలా, స్విగ్గీ, జొమాటో వంటి ఈ–కామర్స్‌ సంస్థల్లో పనిచేసే గిగ్, ప్లాట్‌ఫాం కార్మికులకు క్రమబద్ధమైన వేతనాలు ఉండవు. దీంతో ప్రావిడెంట్‌ ఫండ్, ఆరోగ్య బీమా, పెన్షన్లు వంటి సామాజిక భద్రతా ప్రయోజనాలను కోల్పోతున్నారు. దేశంలో మొత్తం 50 కోట్లకు పైగా శ్రామిక శక్తి ఉండగా ఇందులో 40 కోట్లు అసంఘటిత రంగాల్లోనే ఉన్నారు. వీరిలో ఎక్కువగా వ్యవసాయ, గ్రామీణ కార్మికులే ఉన్నారు. వేతనాలు, పారిశ్రామిక సంబంధం, సామాజిక భద్రత, వృత్తి భద్రత, ఆరోగ్యం–పని పరిస్థితులపై తెచ్చిన కార్మిక చట్టాలకు సంబంధించిన సంస్కరణలను ప్రభుత్వం అమలు చేస్తోందని నిర్మల పేర్కొన్నారు. చదవండి: కేంద్ర బడ్జెట్‌: ఇందులో నాకేంటి?

మరిన్ని వార్తలు