ఉభయ సభలకు పెట్రో సెగలు

9 Mar, 2021 06:32 IST|Sakshi
రాజ్యసభలో విపక్ష సభ్యుల ఆందోళన

విపక్ష కాంగ్రెస్‌ ఆందోళన

నేటి నుంచి 11 గంటలకే ఉభయ సభలు

సాక్షి, న్యూఢిల్లీ: పెట్రో ధరల సెగలు పార్లమెంట్‌ ఉభయ సభలను తాకాయి. మలి విడత బడ్జెట్‌ సమావేశాలు సోమవారం ప్రారంభమవగా.. పెట్రో ధరలపై కాంగ్రెస్‌ సభ్యుల ఆందోళనల కారణంగా కార్యక్రమాలకు అంతరాయం కలిగి ఉభయ సభలు వాయిదా పడ్డాయి. ఉదయం 9 గంటలకు రాజ్యసభ సమావేశం ప్రారంభమవగానే కాంగ్రెస్‌ సభ్యులు పెట్రోల్, డీజిల్‌ తదితర పెట్రో ఉత్పత్తుల ధరల పెరుగుదలపై చర్చించాలంటూ ఆందోళనకు దిగారు. ప్రతిపక్ష నేత ఖర్గే ఇచ్చిన నోటీస్‌ను చైర్మన్‌ ప్రస్తావించారు.

పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ ధరలు తరచుగా పెరుగుతున్నాయని ఈ అంశంపై చర్చించాలని ఖర్గే 267వ నిబంధన కింద నోటీసు ఇచ్చినట్టు ౖచైర్మన్‌ ప్రస్తావించారు. అయితే అప్రొప్రియేషన్‌ బిల్లుపై చర్చ జరిగిన సందర్భంలో దీనిపై చర్చించవచ్చని చెబుతూ చైర్మన్‌ ఈ నోటీసును తిరస్కరించారు. ఈ సందర్భంగా ఖర్గే మాట్లాడుతూ ‘ఇది చాలా ముఖ్యమైన అంశం.  ప్రభుత్వం ధరల పెరుగుదలపై ఏ సమాధానం ఇస్తుందోనని ఎదురుచూస్తున్నాం. దీనిపై చర్చించాలి’అని కోరారు. నిరసనలతో సభ నాలుగుసార్లు వాయిదాపడింది. చివరకు.. తిరిగి సభ ప్రారంభమయ్యాక సభాపతి స్థానంలో ఉన్న వందనా చవాన్‌ సభను మంగళవారానికి వాయిదా వేశారు. 

సాయంత్రం 4 గంటలకు లోక్‌సభ సమావేశాలు ప్రారంభం కాగానే విపక్ష కాంగ్రెస్‌ సభ్యులు పెట్రో ఉత్పత్తుల ధరల పెరుగుదలపై ఆందోళన వ్యక్తంచేశారు. ప్రభుత్వం దీనిపై సమాధానం చెప్పాలని నినాదాలు చేశారు. విపక్ష సభ్యులు తమ ఆందోళనను కొనసాగించడంతో సభను రాత్రి 7 గంటల వరకు స్పీకర్‌ వాయిదా వేశారు. 7 గంటలకు తిరిగి సభ ప్రారంభమైనప్పటికీ విపక్ష సభ్యుల ఆందోళన కొనసాగింది. నినాదాలు హోరెత్తడంతో  మంగళవారానికి వాయిదా వేశారు. కరోనా నేపథ్యంలో ఉదయం రాజ్యసభ, సాయంత్రం లోక్‌సభ సమావేశాలు నిర్వహిస్తుండగా.. సభ్యుల కోరిక మేరకు సమావేశాలను పూర్వ రీతిలో ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిర్వహించాలని రాజ్యసభ ౖచైర్మన్‌ వెంకయ్య, లోక్‌సభ సభాపతి బిర్లా నిర్ణయించారు.  

పార్లమెంటు సమావేశాల కుదింపు?
ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో తొలి విడత ఎన్నికల కంటే ముందే సమావేశాలను ముగించాలని తృణమూల్‌ కాంగ్రెస్‌ తదితర పార్టీల సభ్యుల విన్నపం మేరకు ఏప్రిల్‌ 8 వరకు కొనసాగాల్సిన సమావేశాలను ఈనెల 25వ తేదీ నాటికే కుదించనున్నట్టు తెలుస్తోంది.
 

మరిన్ని వార్తలు