మహారాష్ట్రలో కుప్పకూలిన ఐదంతస్తుల భవనం

25 Aug, 2020 04:13 IST|Sakshi

శిథిలాల కింద 51 మంది?

ఒకరు మృతి... కొనసాగుతున్న సహాయక చర్యలు

ముంబై: మహారాష్ట్రలోని రాయ్‌గఢ్‌ జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. మహద్‌ తాలుకా కేంద్రంలోని కాజల్‌పూరలో ఐదంతస్తుల అపార్ట్‌మెంట్‌ భవనం సోమవారం రాత్రి 7 గంటల సమయంలో ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ భవనం శిథిలాల కింద దాదాపు 51 మంది చిక్కుకొని ఉండొచ్చని ఆందోళన వ్యక్తమవుతోంది. రాత్రి 10 గంటల సమయంలో ఒక మృతదేహాన్ని వెలికితీశారు. ప్రాణనష్టం భారీగా ఉండవచ్చని అనుమానిస్తున్నారు. మొత్తం 45 ఫ్లాట్లు ఉన్న తారేక్‌ గార్డెన్‌ అపార్ట్‌మెంటు కుప్పకూలి పెద్ద ఎత్తున దుమ్ము పైకిలేచిన దృశ్యాలతో కూడిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయింది.

ఏడుగురిని శిథిలాల కింది నుంచి రక్షించి ఆసుపత్రికి తరలించినట్లు అధికారి ఒకరు తెలిపారు. 10 ఏళ్ల కిందట నిర్మించిన ఈ అపార్ట్‌మెంటులో నివసించే వారిలో సగం మంది ప్రమాద సమయంలో వివిధ పనులపై బయటే ఉన్నట్లు తెలుస్తోంది. భవనం కూలుతున్న క్రమంలో దాదాపు 70 మంది బయటకు పరుగెత్తి ప్రాణాలను దక్కించుకున్నారని రాయ్‌గఢ్‌ కలెక్టర్‌ నిధి చౌదరి తెలిపారు. ఈ అపార్ట్‌మెం టులో నివసించే మరికొన్ని కుటుంబాలు కోవిడ్‌ కారణంగా స్వస్థలాలకు వెళ్లాయని ఆమె వెల్లడిం చారు. మొత్తం 51 మంది ఆచూకీ తెలియడం లేదన్నారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే జిల్లా యంత్రాంగంతో మాట్లాడి సహాయక చర్యలను ముమ్మరం చేయాల్సిందిగా ఆదేశించారు. ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు సంఘటన స్థలానికి బయలుదేరాయని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా తెలిపారు.

మరిన్ని వార్తలు