కరోనా విజృంభణ.. 1,305 భవనాలకు సీల్‌

22 Feb, 2021 15:11 IST|Sakshi

 ఆర్థిక రాజధానిలో వేగంగా విస్తరిస్తున్న కరోనా 

ముంబైకర్లు అప్రమత్తంగా ఉండాలని అధికారుల సూచన 

కరోనా నిబంధనలు పాటించాలని 

సొసైటీలకు బీఎంసీ ఆదేశాలు

ముంబై సెంట్రల్ ‌: ముంబై నగర పరిసర ప్రాంతాల్లో గత వారం రోజులుగా కరోనా మహమ్మారి వేగంగా విస్తరిస్తోంది. ఈసారి మురికివాడలను కాకుండా భవనాలను లక్ష్యంగా చేసుకొంది. అనూహ్యంగా పెరుగుతున్న కరోనా కేసులను గుర్తించిన ప్రభుత్వం అప్రమత్తమైంది. ముందుగా ప్రకటించనట్టుగానే కరోనా కట్టడికి కఠిన చర్యలు చేపట్టింది. ఇప్పటి వరకు 1,305 భవనాలను సీల్‌ చేసింది. ఒక భవనంలో ఐదు కంటే అధికంగా కేసులు నమోదైతే ఆ భవనాలను సీల్‌ చేయడం ప్రారంభించింది. ముంబైకర్లు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. దీన్నిబట్టి మళ్లీ కరోనా ఎలా విజృంభిస్తుందనేది స్పష్టమవుతోంది.

ములూండ్‌లో అత్యధికం..
ముంబై ఉపనగరాల్లో అత్యధికంగా భవనాలు సీల్‌ అయ్యాయి. వీటిలో ప్రధానంగా ములూండ్‌ టీ విభాగంలో అత్యధికంగా 233 భవనాలను సీల్‌ చేశారు. ములూండ్‌ తర్వాత ఘాట్కోపర్‌ ఎన్‌ విభాగం, గోరేగావ్‌ పి విభాగంలో 125 భవనాలను సీల్‌చేశారు. మరోవైపు దక్షిణ ముంబైలో గ్రాంట్‌ రోడ్డులో అత్యధికంగా 110 భవనాలను సీల్‌ చేయగా వర్లీ జీ, మాటుంగా ఎఫ్‌ విభాగాలలో ఇంత వరకు ఒక్క భవనం కూడా సీల్‌ కాలేదు. దీన్ని బట్టి ఈ విభాగంలో ప్రభావం కొంత మేర తక్కువగా ఉందని చెప్పవచ్చు. 

నిబంధనలు పాటించండి.. 
కరోనా తగ్గుముఖం పట్టడం వల్ల అన్‌లాక్‌ ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించింది. అయితే కరోనా ఇంకా పూర్తిగా తగ్గలేదని ముప్పు ఉందని అందరు మాస్క్‌లు ధరించడం, చేతులు శుభ్రపరుచుకోవడం, భౌతిక దూరం మొదలగు మూడు సూత్రాలు తప్పనిసరిగా పాటించాలని అధికారులు సూచిస్తూ వచ్చారు. కానీ, అనేక మంది నిర్లక్ష్యంతోపాటు లోకల్‌ రైళ్ల ప్రారంభం, స్వగ్రామాలకు వెళ్లిన వలస కార్మికులు తిరిగి ముంబై చేరుకోవడం వల్ల పెరిగిన రద్దీ,  పెళ్లిల్లు, పార్టీలు, హోటల్స్, మాల్స్‌ లాంటి వాటిలో గుంపులు గుంపులుగా పాల్గొనడం తదితర కారణాల వల్ల మళ్లీ కరోనా మహమ్మారి విజృంభిస్తోందని పరిశీలకులు చెబుతున్నారు. అయితే మురికివాడలలో అంతగా ప్రభావం కన్పించకపోయినప్పటికీ  భవనాల్లో నివసించే వారిలో కరోనా ప్రభావం పెరిగింది. దీంతో అధికారులు భవనాలకు సీల్‌వేసే ప్రక్రియను ముమ్మరం చేశారు.

ఫిబ్రవరి ఒకటో తేదీ వరకు సీల్‌ చేసిన భవనాల సంఖ్య 202 కాగా, కరోనా రోగుల సంఖ్య తగ్గడంతో ఫిబ్రవరి 17 నాటికి  ఈ సంఖ్య 545కు తగ్గిపోయింది. అయితే తగ్గుతుందని భావిస్తున్న తరుణంలో కరోనా రోగుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. దీంతో సీల్‌ చేసిన భవనాల సంఖ్య  ఫిబ్రవరి 20 వరకు పెరిగి 1,305 చేరుకుంది. రోజు రోజుకు పెరుగుతున్న కరోనా కేసుల నేపథ్యంలో మరిన్ని భవనాలకు సీల్‌ వేసే అవకాశం ఉంది. భవనాల్లో కరోనా కేసులు పెరుగుతున్నందు వల్ల అధికారులు నగరంలోని అన్ని హౌసింగ్‌ సొసైటీలను అప్రమత్తం చేశారు. కరోనా లక్షణాలు కలిగిన వ్యక్తుల వివరాలను వెంటనే సంబంధిత విభాగానికి అందించాలని సూచించారు. అదేవిధంగా కరోనా పరీక్షలు పెంచడంతోపాటు పెద్ద ఎత్తున మరోసారి జనజాగృతి చేపట్టారు. కోవిడ్‌ నిబంధనలు పాటించాలని ఆయా సొసైటీలు, కాలనీలకు బీఎంసీ అధికారులు ఇప్పటికే ఆదేశాలు జారీచేశారు.

మరిన్ని వార్తలు