బుల్‌ డోజర్ యాక్షన్‌: యువకునిపై మూత్ర విసర్జన.. నిందితుని ఇల్లు కూల్చివేత..

5 Jul, 2023 16:54 IST|Sakshi

భోపాల్‌: యోగీ ఆదిత్యనాథ్‌ బుల్‌ డోజర్ విధానాన్ని మధ్యప్రదేశ్ ప్రభుత్వం కూడా అనుసరిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల గిరిజన యువకునిపై మూత్ర విసర్జన చేసిన ఓ వ్యక్తి ఇంటిని రాష్ట్ర అధికారులు కూల్చి వేశారు. గిరిజన యువకునిపై మూత్ర విసర్జన చేసిన వీడియో మంగళవారం సోషల్ మీడియాలో వైరల్‌ కాగా.. ప్రభుత్వం స్బందించింది.

వీడియోలో ఓ వ్యక్తి కింద కూర్చున్న గిరిజన యువకునిపై మూత్ర విసర్జన చేశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ కాగా మధ్యప్రదేశ్ సీఎం దృష్టికి వెళ్లింది. నిందితునిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం చెప్పారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితున్ని ప్రవేశ్ శుక్లాగా గుర్తించి అరెస్టు చేశారు. 

నిందితుని అరెస్టు చేసిన అనంతరం.. అక్రమంగా ఆక్రమించాడనే ఆరోపణలతో అధికారులు అతని ఇంటిని బుల్‌ డోజర్‌తో కూల్చివేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అయింది. అయితే.. నిందితుడు పాల్పడిన ఘటన అమానవీయమని రాష్ట్ర హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా అన్నారు. ఇలాంటివారికి సాధారణ శిక్ష సరిపోదని చెప్పారు.

ఇదీ చదవండి: Delhi Court Firing: లాయర్ల మధ్య వాగ్వాదం.. కోర్టు ప్రాంగణంలో కాల్పుల కలకలం

మరిన్ని వార్తలు