ముంబైలో రామ భక్తులపై దాడులు.. నిందితులపై బుల్డోజర్‌ యాక్షన్‌

24 Jan, 2024 08:59 IST|Sakshi

ముంబై: అయోధ్యలో బాల రాముడి ప్రాణ ప్రతిష్టను పురస్కరించుకుని మహారాష్ట్రలో తీసిన ర్యాలీలో రాముడి భక్తులపై ఓ వర్గం వారు దాడి జరిగిన సంగతి తెలిసిందే. ముంబై శివార్లలోని మీరా రోడ్‌లో ఆదివారం రాత్రి  ఈ ఘటన జరిగింది. తాజాగా ఆ ప్రాంతంలో(మీరా రోడ్డు) మహారాష్ట్ర సర్కార్‌ బుల్డోజర్‌ చర్యకు దిగింది.

అక్రమ కట్టడాల కూల్చివేత పేరుతో.. రాముని ఊరేగింపుపై రాళ్లు రువ్విన వారి నివాసాలను బుల్డోజర్‌లతో కూల్చివేసింది. మీరా రోడ్డులో అక్రమంగా నిర్మించిన కట్టడాలను బుల్డోజర్‌తో కూలగొట్టింది. దాదాపు 15 అక్రమ బిల్డింగ్‌లను నేలమట్టం చేసినట్లు పోలీసులు తెలిపారు. కూల్చివేత సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీగా మోహరించారు.

కాగా అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని దేశ వ్యాప్తంగా భారీ ఎత్తున ర్యాలీలు చేపట్టారు. అన్ని ప్రాంతాల్లో భక్తి పాటలు, కోలాటాలతో వేడుకగా శ్రీరాముడి  ఊరేగింపు నిర్వహించారు. బాల రాముడి ప్రాణ ప్రతిష్ట సందర్భంగా మహారాష్ట్రలో చేపట్టిన ర్యాలీలో ఇరు వర్గాల మధ్య  ఘర్షణ ఏర్పడింది. ముంబై శివార్లలోన మీరా రోడ్డులో కార్లు, బైక్‌లపై కాషాయ జెండాతో ఆదివారం  రాముడి శోభా యాత్ర నిర్వహించారు.
చదవండి: Ayodhya: బాలక్‌ రామ్‌ కోసం.. రెండో రోజూ అవే దృశ్యాలు

ఈ ర్యాలీలో  ఓ వర్గానికి చెందిన వ్యక్తులు దాడి చేశారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య మధ్య వాగ్వాదం పెరిగింది. దీంతో ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. ఇప్పటికే ఈ కేసులో పోలీసులు ఇప్పటి వరకు 13 మందిని అరెస్ట్ చేశారు. దీనిపై స్పందించిన డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్‌ మహారాష్ట్రలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఊరుకునే ప్రసక్తి లేదని  హెచ్చరించారు. ఈ క్రమంలోనే బీజేపీ సర్కార్‌ నిందితుల స్థలాల వద్ద బుల్డోజర్‌ యాక్షన్‌ చేపట్టింది.

కాగా బుల్డోజర్‌ యాక్షన్‌ అనేది ముందుగా ఉత్తర ప్రదేశ్‌లోని యోగి ఆదిత్యనాథ్‌ సర్కార్‌ ప్రారంభించింది. గొడవలు, కొట్లాటలు, అల్లర్లు వంటి వివిధ కేసుల్లో నిందితులుగా ఉన్న వారి ఇళ్లు, స్థలాలను బుల్డోజర్‌తో కూల్చివేస్తూ వస్తుంది. తరువాత ఇదే పద్దతిని బీజేపీ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వాలన్నీ అనుసరిస్తన్నాయి. తాజాగా రాజస్థాన్‌కు బుల్డోజర్‌ యాక్షన్ వ్యాపించింది.

>
మరిన్ని వార్తలు