Viral Video: ఘోర రోడ్డు ప్రమాదం.. గాయపడిన చిన్నారిని చూసి కన్నీరు పెట్టుకున్న మహిళా అధికారి

29 Sep, 2022 09:22 IST|Sakshi

లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని లఖీమ్‌పూర్‌ ఖేరీ పరిధిలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో 10 మంది మృత్యువాత పడ్డారు. దాదాపు 41 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలిచించి చికిత్స అందిస్తున్నారు.  730 నంబర్‌ జాతీయ రహదారిపై బస్సు, మినీ ట్రక్‌ ఎదురెదురుగా ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. దౌరాహా నుంచి లక్నోకు వెళ్తున్న ప్రైవేట్‌ బస్సును ఐరా వంతెన మీద ఎదురుగా వస్తున్న మినీ ట్రక్‌ ఢీకొట్టింది.  

గాయపడిన వారిలో 12 మందిని లక్నోలోని ట్రామా సెంటర్‌కు తరలించారు మిగతావారు ఖేరీ జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. లక్నో డివిజనల్‌ కమిషనర్‌ రోషన్‌ జాకబ్‌ క్షతగాత్రులను చూసేందుకు ఆసుపత్రిని సందర్శించారు.

ఈ క్రమంలో ప్రమాదంలో గాయపడిన ఓ చిన్నారి పరిస్థితిని చూసి ఆమె చలించిపోయారు. అతని తల్లితో మాట్లాడుతూ కన్నీటి పర్యంతమయ్యారు. కంటతడి పెట్టుకుంటూనే బాలుడిని ఆప్యాయంగా పరామర్శించారు. అనంతరం అతనికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 

రోడ్డు ప్రమాదంపై రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ, యూపీ సీఎం యోగి సంతాపం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రధాని జాతీయ సహాయ నిధి కింద రూ.2 లక్షలు, గాయపడిన వారికి రూ. 50 వేల ఆర్థికసాయం అందించనున్నట్లు పీఎంఓ కార్యాలయం తెలిపింది.

మరిన్ని వార్తలు