కలలో ప్రత్యక్షం: శివుడి కోసం సమాధిలోకి మహిళ

11 Feb, 2021 18:11 IST|Sakshi

అడ్డగించిన పోలీసులు

ఆస్పత్రిలో చేరిక.. యూపీలో ఘటన

భజనలు చేసి మట్టి పోసి సహకరించిన గ్రామస్తులు

లక్నో: భక్తి, మూఢనమ్మకాల మాటున మానవులు వింతవింత చేష్టలు చేస్తున్న సంఘటనలు పెరుగుతున్నాయి. ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లోని మదనపల్లిలో జరిగిన ఘోరమైన ఘటన మరువకముందే తాజాగా ఉత్తరప్రదేశ్‌లో ఓ సంఘటన జరిగింది. ఓ మహిళ జీవ సమాధి చేసుకునేందుకు ప్రయత్నించింది. పోలీసులు రంగ ప్రవేశం చేసి కొందరి సహాయంతో అడ్డుకోవడంతో ఆమె బతికింది. అయితే తాను శివుడిని ప్రసన్నం చేసుకునేందుకు జీవ సమాధి అవుతానని 50 ఏళ్ల మహిళ రాద్ధాంతం చేసింది. దీనికి గ్రామస్తులంతా సహకరించడం వింత. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి..

కాన్పూర్‌ నగర్‌ జిల్లాలోని ఘటంపూర్‌ ప్రాంతంలో ఉన్న సజేటి గ్రామానికి రామ్‌ సంజీవన్‌, గోమతిదేవి భార్యాభర్తలు. వీరు శివభక్తులు. ఆమె భక్తిభావనలు ఎక్కువగా ఉన్నాయి. తాజాగా పరమేశ్వరుడిని ప్రసన్నం చేసుకోవాలనే ఉద్దేశంతో తాను జీవ సమాధి కావాలని నిర్ణయించుకుంది. ఈ మేరకు ఇంటి బయట గొయ్యి తవ్వి అందులో తనను సమాధి చేయాలని కుటుంబసభ్యులను కోరింది. శివుడు తనకు కలలో కనిపించాడని, మహాశివరాత్రికి ఆయనను ప్రసన్నం చేసుకునేందుకు తాను సమాధి కావాలని పట్టుబట్టింది. దీంతో ఆమెను సమాధి చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు ఇంటి బయట నాలుగు అడుగుల గొయ్యిని తవ్వించారు. ఆ తర్వాత మంచంపై ధ్యానముద్రలో కూర్చుని ఉన్న గోమతిదేవిని గొయ్యిలో దించారు. దీనికి స్థానికులంతా సహకరించారు. అనంతరం అందరూ భజనలు చేస్తూ పూలు, మట్టిని ఆమెపై చల్లారు.

ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు రంగ ప్రవేశం చేశారు. ఆమెను సమాధి చేయడం చూసి ఖంగు తిన్నారు. వెంటనే గోమతిదేవిని గొయ్యి లోపలి నుంచి బయటకు తీసుకొచ్చారు. అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు రావడం ఆలస్యమై ఉంటే ఆమె జీవ సమాధి అయ్యి ఉండేది. మూఢ నమ్మకాలపై పోలీసులు అవగాహన కల్పిస్తున్నారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు