నర్సు నిర్లక్ష్యం: ఫోన్‌ మాట్లాడుతూ మహిళకు రెండుసార్లు వ్యాక్సిన్‌

3 Apr, 2021 19:41 IST|Sakshi

లక్నో: కరోనా వ్యాక్సిన్‌ వేయడంలో అలసత్వం వద్దని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేస్తున్నా కింది స్థాయి సిబ్బంది మాత్రం నిర్లక్ష్యం చేస్తూనే ఉన్నారు. తాజాగా ఓ నర్సు ఫోన్‌లో మాట్లాడుతూ ఓ మహిళలకు రెండు సార్లు కరోనా వ్యాక్సిన్‌ ఇచ్చింది. తప్పు చేసిందే గాక ఆమె దబాయింపుకు పాల్పడడం గమనార్హం. దీంతో టీకా వేసుకున్న మహిళ ఆందోళన చెందుతోంది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌ దేహత్‌ జిల్లాలో చోటుచేసుకుంది.

కాన్పూర్‌ దేహత్‌ జిల్లా అక్బర్‌పూర్‌ ప్రాంతానికి చెందిన మహిళ కమలేశ్‌ కుమారి (50) కరోనా టీకా వేసుకునేందుకు మర్హౌలీలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లింది. అక్కడ ఏఎన్‌ఎం విధులు నిర్వహిస్తోంది. టీకాలు వేస్తున్న సందర్భంలో అర్చన ఫోన్‌లో మాట్లాడుతోంది. ఆ విధంగా ఫోన్‌లో మాట్లాడుతూనే ఆమెకు ఒకసారి టీకా వేసింది. అనంతరం ఆ ఫోన్‌లోనే మునిగి మరొకసారి కూడా వ్యాక్సిన్‌ వేసింది. దీంతో అర్చన తీరుపై కమలేశ్‌కుమారికి ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒకేసారి రెండు టీకాలు వేయడంపై నిలదీసింది. అయితే అర్చన తప్పు చేసిందే గాక ఆమెనే దబాయించి తిట్టి పోసింది.

వెంటనే ఈ విషయాన్ని కమలేశ్‌ కుమారి తన కుటుంబసభ్యులకు సమాచారం అందించింది. రెండు టీకాలు వేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆస్పత్రి ముందు ఆందోళన చేపట్టారు. ఈ విషయంపై వైద్య అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో పాటు కలెక్టర్‌, వైద్య ఉన్నత అధికారులకు సమాచారం ఇచ్చారు. విధుల్లో నిర్లక్క్ష్యం వహించిన అర్చనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. అయితే ఒకేసారి రెండు టీకాలు ఇవ్వడంతో తనకేమన్నా అవుతుందేమోనని కమలేశ్‌ కుమారి ఆందోళన చెందుతున్నారు. 

మరిన్ని వార్తలు