మూడు రాష్ట్రాల్లో ఉప ఎన్నికలు.. షెడ్యూల్‌ ఇదే

2 May, 2022 19:22 IST|Sakshi

న్యూఢిల్లీ: ఒడిశా, కేరళ, ఉత్తరాఖండ్‌లలో ఒక్కో అసెంబ్లీ స్థానానికి మే 31న ఉప ఎన్నికలు నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం ప్రకటించింది. జూన్ 3న ఫలితాలు వెల్లడికానున్నాయి. ఈసీ ప్రకటనతో సంబంధిత నియోజకవర్గాల్లో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఉప ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ బుధవారం విడుదల చేయనున్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది. ఒడిశాలోని బ్రజ్‌రాజ్‌నగర్, కేరళలోని త్రిక్కక్కర, ఉత్తరాఖండ్‌లోని చంపావత్ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు జరగనున్నాయి. 

సీఎం కోసం రాజీనామా
ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి.. చంపావత్ నియోజకవర్గంలో పోటీ చేయనున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో, ఉధమ్ సింగ్ నగర్ జిల్లాలోని ఖతిమా స్థానం నుంచి పుష్కర్ సింగ్ ఓడిపోయారు. ముఖ్యమంత్రి పదవిని నిలబెట్టుకోవాలంటే ఆయన అసెంబ్లీకి ఎన్నిక కావాలి. ఈ నేపథ్యంలో చంపావత్ బీజేపీ ఎమ్మెల్యే కైలాష్ గెహ్టోడి గత నెలలో రాజీనామా చేశారు. (క్లిక్‌: కొత్త ట్విస్ట్‌.. ప్రత్యక్ష రాజకీయాల్లోకి పీకే!)

మరిన్ని వార్తలు