‘మిషన్‌ కర్మయోగి’కి కేబినెట్‌ ఆమోదం

3 Sep, 2020 03:59 IST|Sakshi

ఐదేళ్లలో రూ. 510.86 కోట్ల వ్యయం

భవిష్యత్‌ భారత ఉద్యోగులను రూపొందించే సంస్కరణ

న్యూఢిల్లీ: ప్రభుత్వ ఉద్యోగులను మరింత సమర్థ్ధవంతంగా తీర్చిదిద్దేందుకు ఉద్దేశించిన ‘మిషన్‌ కర్మయోగి’పథకానికి కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం సమావేశమైన కేబినెట్‌ ఈ ‘మిషన్‌ కర్మయోగి లేదా నేషనల్‌ ప్రోగ్రామ్‌ ఫర్‌ సివిల్‌ సర్వీసెస్‌ కెపాసిటీ బిల్డింగ్‌(ఎన్‌పీసీఎస్‌సీబీ)’కార్యక్రమానికి పచ్చ జెండా ఊపింది. ప్రభుత్వ ఉద్యోగులను సృజనాత్మకంగా, సానుకూల దృక్పథం కలిగినవారుగా, వృత్తి నిపుణులుగా, సాంకేతికంగా మరింత మెరుగైన వారిగా మార్చే అతిపెద్ద పాలనా సంస్కరణగా ‘మిషన్‌ కర్మయోగి’ని కేంద్ర ప్రభుత్వం తీర్చిదిద్దింది.

సరైన దృక్పథం, లోతైన జ్ఞానం, ఆధునిక నైపుణ్యాలు కలగలసిన, భారతదేశ భవిష్యత్‌ అవసరాలను తీర్చగల సమర్థ్ధులైన ఉద్యోగులుగా వారిని సిద్ధం చేసేందుకు ఈ కార్యక్రమాన్ని రూపకల్పన చేశారు. ‘మానవ వనరుల అభివృద్ధికి సంబంధించి ఇది అతిపెద్ద ప్రభుత్వ కార్యక్రమం’అని కేబినెట్‌ భేటీ అనంతరం సమాచార ప్రసారశాఖ మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగిని దేశసేవకు ఉపయోగపడే అసలైన కర్మయోగిగా మార్చేలా ఈ కార్యక్రమం ఉంటుందని సిబ్బంది శాఖ సహాయమంత్రి జితేంద్ర సింగ్‌ పేర్కొన్నారు. ‘2020 నుంచి 2025 వరకు దశలవారీగా రూ. 510.86 కోట్ల వ్యయంతో సుమారు 46 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులను భాగస్వామ్యులను చేస్తూ ఈ కార్యక్రమం కొనసాగుతుంది’ అని వివరించారు.

ఈ కార్యక్రమంలో భాగంగా ఒక కెపాసిటీ బిల్డింగ్‌ కమిషన్‌ను ఏర్పాటు చేయనున్నారు. అలాగే, పథకానికి దిశానిర్దేశం చేసేందుకు ప్రధానమంత్రి నేతృత్వంలో కొందరు ఎంపిక చేసిన కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు, ప్రఖ్యాత హెచ్‌ఆర్‌ నిపుణులు సభ్యులుగా ఒక కేంద్ర కమిటీని ఏర్పాటు చేస్తారు. భవిష్యత్‌ భారత అవసరాలను తీర్చగల సమర్ధులైన ఉద్యోగులను రూపొందించడం మిషన్‌ కర్మయోగి లక్ష్యమని ప్రధాని మోదీ పేర్కొన్నారు. జమ్మూ, కశ్మీర్‌లో హిందీ, కశ్మీరీ, డోగ్రీలను అధికార భాషల్లో చేర్చేందుకు ఉద్దేశించిన బిల్లుకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ఈ ప్రాంతంలో ఇప్పటికే ఇంగ్లీష్, ఉర్దూ అధికార భాషలుగా ఉన్నాయి. దీనికి సంబంధించిన ‘జమ్మూకశ్మీర్‌ అఫీషియల్‌ లాంగ్వేజెస్‌ బిల్‌–2020’ని రానున్న సమావేశాల్లో పార్లమెంట్లో ప్రవేశపెడ్తామని జావదేకర్‌ వెల్లడించారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు