కేంద్ర ఉద్యోగులకు బోనస్‌

22 Oct, 2020 04:18 IST|Sakshi

30.67 లక్షల మంది ఉద్యోగులకు రూ. 3,737 కోట్ల లబ్ధి

కేంద్ర కేబినెట్‌ నిర్ణయం

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త తెలిపింది. దసరా సందర్భంగా బోనస్‌ ప్రకటించింది. సుమారు 30.67 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు రూ. 3,737 కోట్ల బోనస్‌ను అందజేయాలన్న ప్రతిపాదనకు బుధవారం కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది. 2019–2020 సంవత్సరానికి గానూ ఉద్యోగులకు ఉత్పాదకత ఆధారిత బోనస్‌ (ప్రొడక్టివిటీ లింక్డ్‌ బోనస్‌– పీఎల్‌బీ), ఉత్పాదకతకు సంబంధం లేని బోనస్‌ (నాన్‌ పీఎల్‌బీ లేదా అడ్‌హాక్‌) ఇవ్వాలని నిర్ణయించినట్లు∙సమాచార, ప్రసార శాఖ మంత్రి జవదేకర్‌ వెల్లడించారు.

ఈ బోనస్‌ వల్ల దసరా, దీపావళి ఉత్సవాల సందర్భంగా ఉద్యోగుల కొనుగోళ్లు పెరిగి, తద్వారా ఆర్థిక వ్యవస్థలో డిమాండ్‌ పెరుగుతుందని భావిస్తున్నామన్నారు. ‘ప్రతీ సంవత్సరం దసరా సమయంలో ఉద్యోగులకు గత సంవత్సర ఉత్పాదకత ఆధారంగా బోనస్‌ ప్రకటించడం ఆనవాయితీ. ఈ సంవత్సరం కూడా పీఎల్‌బీ, అడ్‌హాక్‌ బోనస్‌ను తక్షణమే అందించనున్నాం’ అని కేంద్రం ఒక ప్రకటనలో తెలిపింది. రైల్వే, పోస్ట్స్, డిఫెన్స్, ఈపీఎఫ్‌ఓ, ఈఎస్‌ఐసీ, తదితర విభాగాలకు చెందిన సుమారు 16.97 లక్షల మంది నాన్‌ గెజిటెడ్‌ ఉద్యోగులకు రూ. 2,791 కోట్లతో 2019–20 సంవత్సరానికి గానూ పీఎల్‌బీ అందించనున్నారు.

సుమారు 13.70 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ నాన్‌గెజిటెడ్‌ ఉద్యోగులకు రూ. 946 కోట్లతో అడ్‌హాక్‌ బోనస్‌ను ఇవ్వనున్నారు. జమ్మూకశ్మీర్‌లో నాఫెడ్‌ (నేషనల్‌ అగ్రికల్చరల్‌ కో ఆపరేటివ్‌ మార్కెటింగ్‌ ఫెడరేషన్‌) ద్వారా 12 లక్షల టన్నుల యాపిల్‌ను సేకరించే పథకాన్ని 2020–21 సీజన్‌లో కొనసాగించాలని కేబినెట్‌ నిర్ణయించింది. ఇందుకు నాఫెడ్‌ వద్ద ప్రభుత్వ హామీగా ఉన్న రూ. 2500 కోట్లను వినియోగించేందుకు అనుమతించింది. కశ్మీర్‌లో  పంచాయతీరాజ్‌ చట్టం– 1989 అమలు ప్రతిపాదనను కేబినెట్‌ ఆమోదించింది. మూడంచెల పంచాయతీరాజ్‌ విధానం కశ్మీర్లోనూ అమలు కానుంది.  

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు