స్వల్పకాలిక రుణాలపై 1.5% వడ్డీ రాయితీ

18 Aug, 2022 05:11 IST|Sakshi

రూ. 3 లక్షలలోపు వ్యవసాయ రుణాలకు వర్తింపు 

కేంద్ర కేబినెట్‌ ఆమోదం  

న్యూఢిల్లీ: వ్యవసాయ రంగంలో రుణ వితరణను పెంచాలని కేంద్ర మంత్రివర్గం నిర్ణయించింది. రూ.3 లక్షలలోపు స్వల్పకాలిక వ్యవసాయ రుణాలపై 1.5 శాతం వడ్డీ రాయితీ ఇచ్చేందుకు ఆమోదం తెలిపింది. కేంద్ర కేబినెట్‌ బుధవారం ప్రధాని మోదీ అధ్యక్షతన సమావేశమయ్యింది. ఈ భేటీ వివరాలను సమాచార, ప్రసార మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ మీడియాకు తెలియజేశారు. సాగు కోసం తీసుకున్న స్వల్పకాలిక రుణాలపై 1.5 శాతం వడ్డీ రాయితీని పునరుద్ధరించాలని నిర్ణయించినట్లు చెప్పారు.

2022–23 నుంచి 2024–25 వరకూ అన్ని రకాల బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, కంప్యూటరైజ్డ్‌ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల నుంచి తీసుకున్న రూ.3 లక్షలలోపు రుణాలపై ఈ రాయితీ వర్తిస్తుందని అన్నారు. ఈ పథకం అమలు కోసం బడ్జెట్‌ కేటాయింపుల కంటే అదనంగా రూ.34,856 కోట్లు కేటాయించాల్సి ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఎరువులపై రాయితీ రూ.2 లక్షల కోట్లు దాటే అవకాశం ఉందని ఠాకూర్‌ చెప్పారు. వాస్తవానికి వ్యవసాయ రుణాలపై వడ్డీ రాయితీని 2020 మే నెలలో నిలిపివేశారు. బ్యాంకులు 7 శాతం వడ్డీ రేటుతో రైతులకు రుణాలిస్తున్నాయి. ఆర్‌బీఐ ఇటీవల రెపో రేటును పెంచింది. దీంతో వ్యవసాయ రుణాలపై వడ్డీ రేట్లు పెరగనున్నాయి. అందుకే వడ్డీ రాయితీని మళ్లీ అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.  

ఈసీజీఎల్‌ఎస్‌కు మరో రూ.50,000 కోట్లు  
ఎమర్జెన్సీ క్రెడిట్‌ లైన్‌ గ్యారంటీ స్కీమ్‌ (ఈసీజీఎల్‌ఎస్‌)కు 2022–23 కేంద్ర బడ్జెట్‌లో రూ.4.5 లక్షల కోట్లు కేటాయించారు. ఈ పథకానికి మరో రూ.50,000 కోట్లు ఇవ్వనున్నారు. అదనపు సొమ్మును కోవిడ్‌తో దెబ్బతిన్న ఆతిథ్య, అనుబంధ రంగాలకు రుణాలిస్తారు.  

భారత్‌–ఫ్రాన్స్‌ ఒప్పందానికి ఆమోదం   
భారత రవాణా రంగంలో అంతర్జాతీయ రవాణా వేదిక(ఐటీఎఫ్‌) కార్యకలాపాలకు ఊతం ఇవ్వడానికి భారత్‌–ఫ్రాన్స్‌ మధ్య కుదిరిన ఒప్పందానికి కేంద్ర కేబినెట్‌ ఆమోదముద్ర వేసింది. 2022 జూలై 6న ఈ ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం రవాణా రంగంలో కర్బన ఉద్గారాలను తగ్గించాలని లక్ష్యంగా నిర్దేశించారు.  

ఇకపై అందరికీ టీకేడీఎల్‌ డేటాబేస్‌  
సంప్రదాయ విజ్ఞాన డిజిటల్‌ లైబ్రరీ(టీకేడీఎల్‌) డేటాబేస్‌ను ఇకపై కేవలం పేటెంట్‌ అధికారులే కాదు సామాన్యులు ఉపయోగించుకోవచ్చు.  జాతీయ, అంతర్జాతీయ యూజర్లకు దశలవారీగా ఈ డేటాబేస్‌ను అందుబాటులోకి తీసుకొస్తారు. చందారూపంలో రుసుము చెల్లించి వాడుకోవచ్చు.

మరిన్ని వార్తలు