సాంకేతిక లోపం.. కేబుల్‌ కారులో చిక్కుకున్న 11 మంది టూరిస్టులు

21 Jun, 2022 05:50 IST|Sakshi

హిమాచల్‌లో నిలిచిపోయిన కేబుల్‌ కార్‌ 

11 మందిని కాపాడిన యంత్రాంగం

సిమ్లా: ప్రకృతి అందాలను ఆస్వాదించాలని కేబుల్‌కార్‌ ఎక్కిన పర్యాటకులు రోప్‌వేలో సాంకేతిక లోపంతో కొన్ని గంటలపాటు తీవ్ర భయాందోళనల మధ్య గాల్లోనే గడపాల్సి వచ్చింది. హిమాచల్‌ప్రదేశ్‌ రాష్ట్రం సొలాన్‌ జిల్లా పర్వానూ సమీపంలోని టింబర్‌ ట్రయల్‌ ప్రైవేట్‌ రిసార్ట్‌ వద్ద ఢిల్లీకి చెందిన 11 మంది పర్యాటకులు సోమవారం టింబర్‌ ట్రయల్‌ కేబుల్‌ కార్‌ ఎక్కారు. రోప్‌వేలో సాంకేతిక లోపం కారణంగా అది మధ్యలోనే సుమారు 250 అడుగుల ఎత్తులో నిలిచిపోయింది. సమాచారం అందుకున్న రాష్ట్ర విపత్తు నిర్వహణ బృందం అక్కడికి చేరుకుని, మరో కేబుల్‌ కార్‌ ట్రాలీని అక్కడికి పంపించి, ఒక్కొక్కరికీ తాడు కట్టి క్షేమంగా కిందికి దించింది.

6 గంటలు శ్రమించి అందులో చిక్కుకు పోయిన ఐదుగురు మహిళలు సహా మొత్తం 11 మందిని సురక్షితంగా కిందికి తీసుకువచ్చినట్లు అధికారులు తెలిపారు. ఘటన నేపథ్యంలో కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాతో ఫోన్‌లో మాట్లాడినట్లు సీఎం జైరాం ఠాకూర్‌ చెప్పారు. ఎయిర్‌ఫోర్స్‌ హెలికాప్టర్‌తోపాటు ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాన్ని ఆయన వెంటనే  ఘటనాస్థలికి పంపించారని వెల్లడించారు. 1992లోనూ టింబర్‌ ట్రయల్‌ వద్ద ఇలాంటి ఘటనే చోటుచేసుకోగా, కేబుల్‌ కార్‌లో చిక్కుకుపోయిన 10 మందిని ఆర్మీ కాపాడింది. గత ఏప్రిల్‌లో జార్ఖండ్‌లోని త్రికూట్‌ పర్వతాల వద్ద రోప్‌వే గాల్లోనే నిలిచిపోయింది. ఆర్మీ సుమారు 40 గంటలపాటు శ్రమించి 12 మందిని రక్షించగా మరో ముగ్గురు ప్రమాదవశాత్తూ ప్రాణాలు కోల్పోవడం తెలిసిందే.

చదవండి: Breaking: ఆర్మీలో అగ్నివీర్‌ నోటిఫికేషన్‌ విడుదల

కాగా 1992 అక్టోబర్‌లోనూ ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. ఇదే రోప్‌వేలో 11 మంది ప్రయాణికులు చిక్కుకుపోగా ఆర్మీ,  వైమానిక దళం జరిపిన ఆపరేషన్‌లో  10 మందిని రక్షించారు. ఒకరు మరణించారు. అలాగే జార్ఖండ్‌లోని డియోఘర్ జిల్లాలో గత ఏప్రిల్‌లో పర్యాటకులు 40 గంటలకు పైగా కేబుల్ కార్లలో చిక్కుకుపోయారు. వారిలో ముగ్గురు మరణించారు.

మరిన్ని వార్తలు