నారద కేసు: టీఎంసీ నేతలకు ఊరట

28 May, 2021 16:32 IST|Sakshi

కోల్‌కతా: నారద స్టింగ్ టేప్స్ కేసులో నలుగురు టీఎంసీ నేతలకు కలకత్తా హైకోర్టు శుక్రవారం తాత్కాలిక బెయిలు మంజూరు చేసింది. రూ.2 లక్షలు చొప్పున వ్యక్తిగత పూచీకత్తులు సమర్పించాలని ఆదేశించింది. ఈ కేసుకు సంబంధించిన అంశాలపై ఎలాంటి న్యూస్ ఛానల్స్‌కు ఇంటర్వ్యూలు ఇవ్వకూడదని షరతు విధించింది. టీఎంసీ నేతలు ఫిర్హాద్ హకీమ్, మదన్ మిత్రా, సుబ్రత ముఖర్జీ, సోవన్ ఛటర్జీలను మే 17న సీబీఐ అరెస్టు చేసింది. అప్పటి నుంచి వీరు జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. తాజాగా వీరికి తాత్కాలిక బెయిల్‌ ఇచ్చిన కోర్టు.. నిబంధనలు ఉల్లఘింస్తే బెయిల్‌ను రద్దు చేస్తామని హెచ్చరించింది. ఇక కేసుకు సంబంధించి కోర్టుకు ఏమైనా అవసరం వస్తే వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా దర్యాప్తులో పాల్గొనేందుకు అవకాశం కల్పించింది.

తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)లో అవినీతిని బయటపెట్టడం కోసం ‘నారద న్యూస్’ అనే న్యూస్ ఔట్‌లెట్ స్టింగ్ ఆపరేషన్ నిర్వహించింది. దీనినే నారద స్టింగ్ ఆపరేషన్ అంటారు. నారద న్యూస్ వ్యవస్థాపకుడు మాథ్యూ శామ్యూల్ 2014-2016 మధ్య కాలంలో దాదాపు 12 మంది టీఎంసీ నేతలపైనా, ఓ ఐపీఎస్ అధికారిపైనా స్టింగ్ ఆపరేషన్ నిర్వహించారు. ఇంపెక్స్ కన్సల్టెన్సీ సొల్యూషన్స్ అనే సంస్థకు వ్యాపార ప్రయోజనాలు కల్పించేందుకు వీరు నగదును తీసుకుంటున్నట్లు వీడియోలో కనిపించారు. స్టింగ్ ఆపరేషన్ చేయడం కోసమే ఈ కల్పిత సంస్థను శామ్యూల్ సృష్టించారు.

2014లో ఈ స్టింగ్ ఆపరేషన్ జరిగినప్పటికీ, 2016లో ‘తెహల్కా’ ప్రచురించింది. పశ్చిమ బెంగాల్ శాసన సభ ఎన్నికలకు ముందు దీనిని వెలుగులోకి తీసుకొచ్చారు. ఈ స్టింగ్‌ ఆపరేషన్‌లో పట్టుబడినవారిలో ముకుల్ రాయ్, సౌగత రాయ్, కకోలీ ఘోష్ దస్తిదార్, ప్రసూన్ బెనర్జీ, సువేందు అధికారి, అపరుప పొద్దార్, సుల్తాన్ అహ్మద్, మదన్ మిత్రా, సోవన్ ఛటర్జీ, సుబ్రత ముఖర్జీ, ఫిర్హాద్ హకీమ్, ఇక్బాల్ అహ్మద్, షంకు దేబ్ పాండా సహా ఐపీఎస్ అధికారి హెచ్ఎంఎస్ మీర్జా ఉన్నారు. 
చదవండి: నారద కేసును రాష్ట్రం వెలుపలికి బదిలీ చేయాలి: సీబీఐ

నారదా స్టింగ్‌ ఆపరేషన్‌: మంత్రులకు బెయిల్‌

మరిన్ని వార్తలు