బెంగాల్‌ హింసపై సీబీఐ దర్యాప్తు

20 Aug, 2021 05:23 IST|Sakshi

హత్యలు, అత్యాచారాలు జరిగినా కేసులేవీ?

దర్యాప్తు నుంచి తప్పించుకోవాలన్న దుర్బుద్ధి ప్రదర్శించారు

కలకత్తా హైకోర్టు తీర్పు

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో శాసనసభ ఎన్నికల అనంతరం చోటుచేసుకున్న హింసాకాండపై కలకత్తా హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అత్యాచారం, హత్య వంటి దారుణాలు చోటుచేసుకోవడం దారుణమని పేర్కొంది. కొన్ని సంఘటనల్లో బాధితుల ఫిర్యాదులను అధికారులు నమోదు చేయలేదని తప్పుపట్టింది. బెంగాల్‌లో ఎన్నికల అనంతరం జరిగిన హింసపై జాతీయ మానవ హక్కుల సంఘం(ఎన్‌హెచ్‌ఆర్‌సీ) చేసిన సిఫార్సులను హైకోర్టు ఆమోదించింది. హింసాకాండపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశిస్తూ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రాజేష్‌ బిందాల్‌ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఏకగ్రీవ తీర్పును వెలువరించింది.

ఎన్నికల తర్వాత హింసకు సంబంధించిన ఇతర అన్ని కేసులపై దర్యాప్తు చేపట్టడానికి ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్‌) ఏర్పాటు చేయాలని ఆదేశించింది. బెంగాల్‌ దురాగతాలపై స్వతంత్ర దర్యాప్తు జరిపించాలని కోరుతూ కలకత్తా హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై ధర్మాసనం గురువారం విచారణ జరిపింది. ఎన్‌హెచ్‌ఆర్‌సీ కమిటీ నివేదిక ప్రకారం హత్య, అత్యాచారం, అత్యాచార యత్నానికి సంబంధించిన అన్ని కేసులను తదుపరి దర్యాప్తు నిమిత్తం సీబీఐకి తక్షణమే బదిలీ చేయాలని, సంబంధిత రికార్డులను అప్పగించాలని బెంగాల్‌ ప్రభుత్వానికి సూచించింది. సీబీఐ, సిట్‌ దర్యాప్తును తాము పర్యవేక్షిస్తామని తెలిపింది. ఆరు వారాల్లోగా స్టేటస్‌ రిపోర్టు తమకు సమర్పించాలని సీబీఐ, సిట్‌కు ధర్మాసనం స్పష్టం చేసింది. దీంతో గురువారమే రంగంలోకి దిగిన సీబీఐ దర్యాప్తునకు నాలుగు బృందాలను ఏర్పాటు చేసింది.

హింస జరిగినా కేసులు నమోదు చేయరా?
ఎన్నికల తర్వాత ఎన్నో దారుణాలు చోటుచేసుకున్నాయని, హత్యలు జరిగినా ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయలేదని ధర్మాసనం పేర్కొంది. దీన్నిబట్టి దర్యాప్తు నుంచి తప్పించుకోవాలన్న దుర్బుద్ధిని ప్రదర్శించినట్లు అర్థమవుతోందని వ్యాఖ్యానించింది. ఇలాంటి పరిస్థితుల్లో స్వతంత్ర సంస్థతో దర్యాప్తు జరిపిస్తే బాధితుల్లో నమ్మకం పెరుగుతుందని తెలియజేసింది. ఎన్నికలు, ఫలితాల అనంతరం హింస కేవలం ఏ ఒక్క ప్రాంతానికో పరిమితం కాలేదని వివరించింది. హత్యలు, అత్యాచారాలకు పాల్పడడంతోపాటు అధికార పార్టీకి మద్దతు ఇవ్వని వారి ఇళ్లను కూల్చివేశారని, వారి ఆస్తులను ధ్వంసం చేశారని న్యాయస్థానం ఉద్ఘాటించింది. కేసులు వెనక్కి తీసుకోవాలంటూ బాధితులను బెదిరించారని తెలిపింది.

కొన్ని హత్యలను సహజ మరణాలుగా చిత్రీకరిస్తూ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయలేదని తన ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. పెద్ద ఎత్తున హింస జరిగినా కేసులు పెట్టకపోవడం ప్రజాస్వామ్య వ్యవస్థకు చేటు కలిగిస్తుందని ఆందోళన వ్యక్తం చేసింది. ప్రభుత్వ విధానాల ప్రకారం బాధితులకు నష్ట పరిహారం చెల్లించాలని పశ్చిమ బెంగాల్‌ సర్కార్‌నుఆదేశించింది. హింసపై కలకత్తా హైకోర్టు సీబీఐ దర్యాప్తునకు ఆదేశించడాన్ని బీజేపీ స్వాగతించింది. ఈ తీర్పు రాజ్యాంగ విజయమని అభివర్ణించింది. ప్రజాస్వామ్యంలో న్యాయ వ్యవస్థ అత్యున్నతమైనదన్న విషయంలో మరోసారి నిరూపితమైందని బీజేపీ నేత సువేందు అధికారి చెప్పారు. హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాలు చేస్తామన్న సంకేతాలను తృణమూల్‌ కాంగ్రెస్‌ ఇచ్చింది.

మరిన్ని వార్తలు