భారత్‌ విమానాలపై కెనడా నిషేధం

24 Apr, 2021 02:04 IST|Sakshi

న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా కేసులు ఉధృతంగా పెరిగిపోతూ ఉండడంతో రాకపోకలపై ఆంక్షలు విధిస్తున్న దేశాల జాబితా పెరిగిపోతోంది. తాజాగా కెనడా భారత్‌పై రవాణా ఆంక్షల్ని విధించింది. భారత్, పాకిస్తాన్‌ నుంచి పౌర విమానాలపై 30 రోజులు నిషేధం విధిస్తున్నట్టుగా కెనడా ప్రకటించింది. ఈ నిషేధం గురువారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చినట్టుగా కెనడా రవాణా మంత్రి ఒమర్‌ వెల్లడించారు. ఇప్పటికే యూకే, ఆస్ట్రేలియా, సింగపూర్‌ దేశాలు ప్రయాణాలను నిషేధించాయి. అమెరికా అత్యవసరమైతే తప్ప భారత్‌కు వెళ్లవద్దంటూ ఇప్పటికే తమ పౌరులకి హెచ్చరికలు జారీ చేసింది.

యూకేలో మరో 55 డబుల్‌ మ్యూటెంట్‌ కేసులు 
భారత్‌ నుంచి వచ్చే ప్రయాణికులపై యూకే విధించిన రెడ్‌ లిస్ట్‌ ఆంక్షలు శుక్రవారం నుంచి అమల్లోకి వచ్చాయి. భారత్‌ పౌరులెవరినీ యూకేకి రాకుండా నిషేధం విధించారు. ఇప్పటికే భారత్‌లో ఉన్న బ్రిటిష్, ఐరిష్‌ పౌరులు తిరిగి స్వదేశానికి రావాలనుకుంటే తప్పనిసరిగా పది రోజుల పాటు హోటల్‌లో క్వారంటైన్‌ ఉండాలి. భారత్‌ డబుల్‌ మ్యూటెంట్‌ బి.1.617 కేసులు మరో 55 యూకేలో బయటపడడంతో అక్కడి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.    

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు