భారత్‌ను వీడిన కెనడా దౌత్యవేత్తలు

6 Oct, 2023 16:41 IST|Sakshi

ఢిల్లీ: భారత్‌లో ఉన్న కెనడా దౌత్యవేత్తల సంఖ్యను తగ్గించాలని కేంద్రం కోరిన విషయం తెలిసిందే. ఈ అంశంపై కెనడా స్పందించింది. తమ దౌత్య వేత్తలను భారత్‌ నుంచి ఖాలీ చేయించింది. సింగపూర్‌కు తరలించినట్లు తెలుస్తోంది. ఖలిస్థానీ ఉగ్రవాది హర్దిప్ సింగ్ నిజ్జర్ హత్య కేసు పరిణామాల అనంతరం దౌత్యవేత్తల సంఖ్యను సమానంగా ఉంచాలని భారత్ కోరిన నేపథ్యంలో కెనడా ఈ మేరకు చర్యలు తీసుకుంది. 

భారత్‌లో ఉన్న కెనడా దౌత్య వేత్తలను దాదాపు 40 మంది వరకు బయటకు పంపించాలని భారత్ కెనడాకు హెచ్చరికలు జారీ చేసింది. ఇరుదేశాల్లో దౌత్య వేత్తలు సమాన సంఖ్యలో ఉండాల్సిందేనని తేల్చిచెప్పింది. అక్టోబర్ 10 నాటికి చివరి గడువును విధించింది. అప్పటికీ ఖాలీ చేయకపోతే.. రక్షణను నిలిపివేస్తామని హెచ్చరించింది. ఖలిస్థానీ ఉగ్రవాది హర్దిప్ సింగ్ నిజ్జర్ హత్య కేసుపై ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న వేళ.. భారత్ ఘాటుగా స్పందించింది. 

అయితే.. కెనడా దౌత్య వేత్తలు ఎంత మంది భారత్‌ను వీడారనేది మాత్రం స్పష్టంగా తెలియదు. కానీ వారిని మాత్రం సింగపూర్‌కు తరలించినట్లు కెనడాకు చెందిన ఓ మీడియా కథనం వెల్లడించింది. ఖలిస్థానీ ఉగ్రవాది హర్దిప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత్ ప్రమేయం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపించడం ఇరుదేశాల మధ్య ఉద్రిక్తత నెలకొంది.

ట్రూడో వ్యాఖ్యలపై భారత్ తీవ్రంగా స్పందించింది. ఎలాంటి ఆధారాలు లేకుండా కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం ట్రూడో ఈ వ్యాఖ్యలు చేశారని మండిపడింది. అనంతరం ఇరుదేశాలు ఆంక్షల దిశగా చర్యలు తీసుకున్నాయి. భారత్ కెనడా వీసాలను రద్దు చేసింది. అనంతరం ఇరుదేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.     

ఇదీ చదవండి: ఎన్నికల ముందు ఉచితాలు.. ఆ రెండు రాష్ట్రాలకు సుప్రీం నోటీసులు

మరిన్ని వార్తలు